జహీరాబాద్, మార్చి 3: నిమ్జ్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న బాధితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని ముంగిగిరిజనతండా వాసులు స్పష్టం చేశారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టర్ ఆదేశాల మేరకు నిమ్జ్ ప్రాజెక్టు కోసం మొదటి విడతలో సేకరించిన 3,245 ఎకరాల్లో మౌలిక వసతుల కోసం సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసేందుకు భారీ పోలీసు బందోబస్తు మధ్య మండల రెవెన్యూ, నిమ్జ్ అధికారులు, ఎస్ఆర్ఆర్ ప్రైవేట్ డెవలపర్స్ కలిసి ముంగి గిరిజనతండాకు చేరుకున్నారు.
స్థానిక గ్రామ శివారులోని ప్రభుత్వ, పట్టా భూములకు సంబంధించిన 1,536 ఎకరాల చుట్టూ సంబంధిత అధికారులు సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసేందుకు జేసీబీలతో గుంతలు తవ్వుతుండగా తండాకు చెందిన బాధిత రైతులు, తండావాసులు అడ్డుకున్నారు. ఉపాధి కోసం ప్రభుత్వం భూములు పంపిణీ చేస్తే వాటిని నమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు. నిమ్జ్ ప్రాజెక్టులో గ్రామానికి చెందిన భూములు తీసుకున్నప్పటికీ ఎకరానికి రూ.5.60 లక్షలు మాత్రమే చెల్లించి ప్రభుత్వం చేతులు దులుపుకొంటున్నారు.
అరకొరగా చెల్లించిన పరిహారంతో తీవ్రంగా నష్టపోయామని, మార్కెట్లో ఇంటి స్థలాన్ని కూడా కొనుగోలు చేసేందుకు వీలులేకుండా పోయిందన్నారు. భూమికి బదులుగా మరో చోట భూములు ఇవ్వాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం తమ భూములకు మెరుగైన పరిహారం చెల్లించాలని, భూములపై ఆధారపడిన రైతులు, కూలీలకు పునరావాసంతో పాటు భూములు కోల్పోయిన బాధిత రైతులకు 125 గజాల ఇంటి స్థలం, ఇల్లు, ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ హైకోర్టులో కేసు వేశామని, కోర్టు తీర్పు వచ్చే వరకు తమ భూముల్లో ఎలాంటి పనులు చేయవద్దని సంబంధిత అధికారులతో మొరపెట్టుకున్నారు.
నిమ్జ్ ప్రాజెక్టులో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పుడే భూములు స్వాధీనం చేసుకోవడం లేదని, సాగులో ఉన్న పంటలు కోత పూర్తైన తర్వాతే పనులు చేపడుతామని సంబంధిత నిమ్జ్, రెవెన్యూ అధికారులు తెలిపినా బాధిత రైతులు, తండావాసులు ఒప్పుకోలేదు. ఎకరానికి రూ. 15 లక్షల చొప్పున పరిహారంతో ఇతర వసతులు కల్పించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ విషయాన్ని సంబంధిత అధికారులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జహీరాబాద్ ఆర్టీవో దేవుజాతో బాధిత రైతులు, తండావాసులు మాట్లాడారు.బుధవారం జహీరాబాద్ ఆర్డీవో కార్యాలయానికి బాధిత రైతులు, తండావాసులు వస్తే సమస్యలు తెలుసుకుని న్యాయం చేస్తామని ఆర్డీవో చెప్పడంతో బాధిత రైతులు, తండావాసులు శాంతించారు. దీంతో సంబంధిత అధికారులు, పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.