సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉండదు. ఏడేళ్లు గడిచినా కాలనీలకు ఆర్టీసీ బస్సుల అనుసంధానం జరగదు. ఆరంభంలోనే అటకెక్కిన స్కూటి రైడ్లనూ పట్టించుకోరు. కానీ ప్రణాళికల పేరిట గాల్లో మేడలు కట్టేందుకు హైదరాబాద్ మెట్రో సంస్థ ఆరాటపడుతుంది. నగరంలో అట్టడుగుకు పడిపోయిన లాస్ట్ మైల్ కనెక్టివిటీపై దృష్టి పెట్టని మెట్రో సంస్థ… తమను మాత్రం పాడ్ ట్యాక్సీలు ఎక్కిస్తామని హామీ ఇస్తోందంటూ హైదరాబాదీ వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సులే రాలేదు…
లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా నగరవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మెట్రో మార్గాలకు కాలనీల అనుసంధానం అంటూ ఎన్నో ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో ప్రధానమైనది ఆర్టీసీ బస్సుల అనుసంధానం. బీఆర్ఎస్ హయాంలో ఐటీ కారిడార్‌తోపాటు, కీలకమైన మార్గాల్లో షటిల్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో లాస్ట్ మైల్ కనెక్టివిటీని 25శాతం నుంచి 50శాతానికి పెంచలేకపోయింది. అందుబాటులో ఉన్న ఈ స్కూటర్లను సైతం పక్కన పెట్టిన సర్కారు…. అసలు ఆ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయిందనే అంశాన్నీ ఇప్పటివరకు సమీక్షించలేదు. కానీ నగరంలో మాత్రం ఆధునాతన ఈ ట్యాక్సీలను నిర్మిస్తామని చెబుతోంది.
బీఆర్టీఎస్ ఏమైంది?
నగరంలో పెరుగుతున్న ప్రజా రవాణా అవసరాలకు అనుగుణంగా ఆధునాతన రవాణా సౌకర్యాలు కీలకంగా మారాయి. ప్రతి ముగ్గురికీ ఓ వాహనం చొప్పున నగరంలో వాహన విస్పోటనం పెరుగుతోంది. అయినా ప్రజా రవాణా వ్యవస్థకు విస్తృతమైన డిమాండ్ ఉంది. ఇప్పటికీ లక్షలాది మంది కూర్చునే సదుపాయం లేకున్నా… ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఐటీ కారిడార్ల నుంచి కాలనీలకు చేరుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కానీ నగరవాసులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పినా… బీఆర్టీఎస్ సేవలకే దిక్కు లేకుండా పోయిం ది. ఇక పాడ్ ట్యాక్సీలను ఎప్పుడూ అమలులోకి తీసుకొస్తారని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే అంశాలపై దృష్టి పెట్టకుండా… ప్రతిపాదనల పేరిట జనాలను మభ్యపెడుతున్నారని నగరవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
డ్రైవర్ లెస్ పాడ్ ట్యాక్సీలు…
ఎలక్ట్రిక్ ఆటో, ఇతర వాహనాలకు ధీటుగా 6-8 మంది ప్రయాణించేందుకు డ్రైవర్ లెస్ పాడ్ ట్యాక్సీలతో నగరంలో లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుపడుతోంది. కానీ అంతకంటే ముందే నగరంలో కాలనీలకు ఆర్టీసీ బస్సులను అనుసంధానం చేసి, ప్రైవేటు ప్లేయర్లతో మెట్రో ప్రయాణికులపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించాలని డిమాండ్స్ వస్తున్నాయి. పాడ్ ట్యాక్సీలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్న సంస్థలను హైదరాబాద్ మెట్రో రైలు ఆహ్వానిస్తోంది.