హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యాసంవత్సరం నుంచి ఎంబీఏలో హార్టీ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు ప్రవేశపెట్టాలని అకాడమిక్ కౌన్సిల్ నిర్ణయించింది. సోమవారం వర్సిటీ వసీ డీ రాజిరెడ్డి ఆధ్వర్యంలో అకాడమిక్ కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. 25 సీట్లతో ప్రారంభం కానున్న ఈ కోర్సుకు బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు.
పీజీలో జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బిల్డింగ్ విభాగం, ఎంటమాలజీ విభాగాలను నూతనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే ప్రారంభమైన అశ్వారావుపేట ఉద్యాన కళాశాలను అకాడమిక్ కౌన్సిల్ ఆమోదించింది. 30 సీట్లతో ఈ సంవత్సరం ఉద్యాన డిగ్రీలో అడ్మిషన్లు జరుగనున్నాయి. సెప్టెంబర్‌లో ఐదో స్నాతకోత్సవం జరుపాలని నిర్ణయించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ భగవాన్, డీన్ ఆఫ్ హార్టికల్చర్ చీనా, పీజీ డీన్ సురేశ్, కన్సల్టెంట్ వీరాంజనేయులు, అకాడమిక్ కౌన్సిల్ సభ్యులు, ప్రొఫెసర్లు, తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్(ఐఐఆర్ఎం) ప్రిన్సిపాల్ పోస్టులో అవకతవకలు జరిగినట్టు బాధితుడు డాక్టర్ కే శ్యామ్యూల్ సుధీర్ ఆరోపించారు. అనుభవం ఉన్న తనను పక్కనపెట్టి ప్రిన్సిపాల్‌గా ఎలాంటి అనుభవంలేని వ్యక్తిని ఎంపికచేశారని మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించి, పక్షపాతం చూపారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే విషయంపై తాను ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ (ఏఐసీటీఈ), డీజీపీ, జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అక్రమాలపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరినట్టు పేర్కొన్నారు.