తెలంగాణలో చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణ దేశానికే ఆదర్శమన్నట్టు చెప్పుకొంటూ తిరిగింది కాంగ్రెస్ నాయకత్వం. కానీ తీరా చూస్తే దళిత వర్గాల మధ్య ఆరని చిచ్చును రగిల్చింది. ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం ఖరారు చేసిన రోస్టర్ పాయింట్లు సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయని దళిత నేతలు మండిపడుతున్నారు. రోస్టర్ పాయింట్ల కేటాయింపుపై మాలలు ఆగ్రహంతో ఉండగా, అందరికన్నా తమకే ఎక్కువ నష్టం జరిగిందని ఉపకులాలు మండిపడుతున్నాయి. రోస్టర్ పాయింట్లు సవరించకపోతే పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నాయి.
హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): దళిత వర్గాల మధ్య కాంగ్రెస్ సర్కార్ కుంపటి పెట్టింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా రోస్టర్ పాయింట్లను ఖరారు చేసిందని దళితవర్గాలే నిప్పులు చెరుగుతున్నాయి. ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం ఖరారు చేసిన రోస్టర్ పాయింట్లు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయని దళిత సంఘాల నేతలు, నిరుద్యోగ అభ్యర్థులు మండిపడుతున్నారు. రోస్టర్ పాయింట్లలో ఎస్సీ ‘ఏ’ గ్రూపునకు ప్రాధాన్యత దక్కలేదని, ‘సీ’ గ్రూపునకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.
ఎస్సీ ‘బీ’ గ్రూపునకు లబ్ధి చేకూర్చాలనే కుట్రతోనే రోస్టర్ పాయింట్లను ఖరారు చేసినట్టుగా ఉన్నదని మండిపడుతున్నాయి. ప్రభుత్వం సత్వరమే రోస్టర్ పాయింట్లలో లోపాలను సవరించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే పోరుబాట తప్పదని హెచ్చరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు (రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ) చట్టం-2025’ పేరిట నూతన చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఎస్సీలకు ఇప్పటివరకు గంపగుత్తగా అమలైన రిజర్వేషన్లను ఇకపై గ్రూపుల వారీగా అమలుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మొత్తంగా 59 షెడ్యూల్డ్ కులాలు ఉండగా, ఇప్పటివరకు ఆ కులాలకు రాజ్యాంగబద్ధంగా 15% రిజర్వేషన్లను గంపగుత్తగా అమలు చేస్తున్నారు.
ప్రస్తుతం మొత్తం షెడ్యూల్డ్ కులాలను.. వాటిని జనాభా, ఆర్థిక వెనకబాటు ఆధారంగా మూడు గ్రూపులుగా ప్రభుత్వం విభజించింది. అదేవిధంగా 15% రిజర్వేషన్లను కూడా విభజించింది. ‘ఏ’ గ్రూప్‌లో అత్యంత వెనుకబడిన 15 ఎస్సీ ఉపకులాలను చేర్చి వారికి 1%, ‘బీ’ గ్రూప్‌లో మాదిగసహా 18 కులాలకు 9%, ‘సీ’ గ్రూప్‌లో మాల సహా 26 కులాలకు 5% రిజర్వేషన్లు కల్పించింది. సవరించిన రిజర్వేషన్లను విద్య, ఉద్యోగ నియామకాలు, స్థానిక సంస్థలు, ఇతర వాటిల్లో అమలు చేసేందుకు, అందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలతోపాటు ప్రభుత్వ సర్వీస్ నియమకాల్లో అమలుచేస్తున్న రోస్టర్ పాయింట్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సవరించింది. నూతన రోస్టర్ పాయింట్లను ఖరారు చేసింది. దాని ప్రకారం గ్రూప్-ఏ లోని కులాలకు 7వ రోస్టర్ పాయింటు, గ్రూప్-బీ కులాలకు 2,16,27,47,52,66,72,87,97 రోస్టర్ పాయింట్లు, గ్రూప్-సీలోని కులాలకు 22,41,62,77,91 రోస్టర్ పాయింట్లు కేటాయించింది. ఈ కేటాయింపులపై మాల సంఘాలు, ఎస్సీ ఉపకులాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
రిజర్వేషన్ల మూల సూత్రం అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడం. కానీ, ఎస్సీలకు సంబంధించిన రోస్టర్ పాయింట్ల కేటాయింపు అందుకు విరుద్ధంగా ఉన్నదనే విమర్శలున్నాయి. ఎస్సీ వర్గీకరణపై 1995లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్ 1996లో తన నివేదికను సమర్పించగా, దాని ఆధారంగా 1997 జూన్‌లో ఆనాటి తెలుగుదేశం (ఎన్డీఏ భాగస్వామ్యం) ప్రభుత్వం 15% ఎస్సీ కోటాను ఏ,బీ,సీ,డీగా విభజిస్తూ జీవో విడుదల చేసింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ ‘రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం’ చేసి అమల్లోకి తీసుకొచ్చింది.
ఎస్సీలను ఏ,బీ,సీ,డీ గ్రూపులుగా వర్గీకరిస్తూ, వెనుకబాటుతనం, జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు రిజర్వేషన్ కోటా అమలు చేసింది. రోస్టర్ పాయింట్లను కూడా ఏ,బీ,సీ,డీ వారీగా ప్రాధాన్యతనిస్తూ కేటాయించింది. 2004లో సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని కొట్టివేసింది. ఆ తరువాత గత సంవత్సరం సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ సందర్భంగానూ అత్యంత వెనకబడిన వర్గాలకు న్యాయం చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇదిలాఉంటే, తాజాగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఆ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని న్యాయకోవిదులేకాదు, దళితసంఘాలు విమర్శిస్తున్నాయి.
రోస్టర్ పాయింట్ల కేటాయింపు ఏ,బీ,సీ గ్రూపుల క్రమానుగతంగానే ఉండాలి. దాని ప్రకారం అత్యంత వెనుకబడిన ఎస్సీ ఉపకులాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. తదుపరి గ్రూప్ బీ, ఆపై గ్రూప్ సీకి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా రోస్టర్ పాయింట్లు కేటాయించింది. అత్యంత వెనుకబడిన ఎస్సీ ఉపకులాలను పక్కన పెట్టి గ్రూప్-బీ ఎస్సీ కులాలకు రోస్టర్ పాయింట్లలో మొదటి ప్రాధాన్యత, ఆ తరువాత గ్రూప్-ఏలోని అత్యంత వెనుకబడిన ఎస్సీ కులాలకు 7వ రోస్టర్ పాయింట్ కేటాయించింది.. ఆపై గ్రూప్-సీ కులాలకు అవకాశం కల్పించింది. ఇది పూర్తిగా రిజర్వేషన్ల మూల సూత్రానికే విరుద్ధమని ఎస్సీకులాలు, నిరుద్యోగ అభ్యర్థులు మండిపడుతున్నారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని న్యాయకోవిదులు చెప్తున్నారు.
గ్రూప్ ‘బీ’లోని ఎస్సీ కులాలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ఇష్టారీతిన కుట్రపూరితంగా ఈ విధమైన రోస్టర్‌పాయింట్ల ఖరారు చేసిందని ఏ,సీ గ్రూపులోని ఎస్సీ కులాలు మండిపడుతున్నాయి. ఈ రోస్టర్ పాయింట్ల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలను తొలుత గ్రూప్-బీలోని మహిళా అభ్యర్థితో నింపుతారు. అకడ అర్హతలున్న అభ్యర్థి లేకుంటే గ్రూప్-ఏ, ఆ తర్వాత గ్రూప్-సీలోని కులాలతో భర్తీ చేస్తారు. మూడు గ్రూపుల్లోనూ అర్హ త కలిగిన అభ్యర్థులు లేకపోతే, ఆయా ఖాళీల ను క్యారీఫార్వర్డ్ చేస్తారు. ఇది కేవలం గ్రూప్-బీ అభ్యర్థుల కోసమే రూపొందించినట్టు ఉన్నదని ఏ,సీ గ్రూపులోని ఎస్సీ కులాలు వివరిస్తున్నాయి.
ఒక గ్రూపులో అర్హతలున్న మహిళా అభ్యర్థి లేకుంటే, అదే గ్రూపునకు సంబంధించిన పురుష అభ్యర్థితోనే పోస్టును భర్తీ చేయాలని, ఆ మేరకు అర్హులు లేకుంటే తదుపరి గ్రూపునకు సంబంధించిన అభ్యర్థికి అవకాశం కల్పించాలని, కానీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా రోస్టర్ పాయింట్లను ఖరారు చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎస్సీ ఓవర్సీస్తోపాటు పలు పథకాలను అదే తరహాలోనే అమలు చేస్తున్నారని ఉదహరిస్తున్నాయి. కానీ, సర్కార్ మాత్రం కేవలం గ్రూప్-బీకి లబ్ధి చేకూర్చేందుకే కుట్రపూరితంగా రోస్టర్ పాయింట్లను రూపొందించిందని ఇతర గ్రూపుల్లోని కులాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం తక్షణం స్పందించి లోపాలను సవరించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే పోరుబాట పట్టక తప్పదని హెచ్చరిస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం. కేవలం జనాభా దామాషా ఆధారంగా రిజర్వేషన్లను పంపిణీ చేసింది. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని ప్రా మాణికంగా తీసుకోలేదు. మాల, మాదిగ కులాల కంటే అత్యంత దుర్భర స్థితిలో ఇతర ఎస్సీ ఉపకులాలున్నాయి. కానీ, ఆ రెండు గ్రూపులతోనే మళ్లీ కలిపి రిజర్వేషన్లు పంచింది. రోస్టర్ పాయింట్లలో ‘ఏ’ గ్రూప్‌నకు తొలి ప్రాధాన్యతనివ్వకుండా ‘బీ’ గ్రూప్‌నకు ఇవ్వడం తీవ్ర అన్యాయం. ఉపకులాలకు మళ్లీ అన్యాయమే చేసింది. తక్షణం రోస్టర్‌ను సవరించాలి.
– భైరి వెంకటేశం, 57ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు
ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా చేసింది. రోస్టర్ పాయింట్ల కేటాయింపునూ ఒకే గ్రూపునకు లబ్ధి చేకూర్చేలా ఖరారు చేసింది. దీంతో గ్రూపు ఏ,సీలోని కులాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఉన్నతస్థాయి అసిస్టెంట్ ప్రొఫెసర్, గ్రూప్-1 తదితర పోస్టులేవీ దక్కకుండా పోయే ప్రమాదమున్నది. సీ గ్రూపునకు రోస్టర్ పాయింట్లలో 22కు బదులుగా 16వ నంబర్‌ను కల్పించాలి. ప్రభుత్వం అందుకు అనుగుణంగా నూతన సర్వీస్ నియామకాలను సవరించాలి. లేదంటే న్యాయపోరాటం చేస్తాం.
-బత్తులరాంప్రసాద్, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు