నెల్లికుదురు : చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో మునిగి ఇద్దరు మృతి చెంది న ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదు రు మండలం మేచరాజుపల్లి శివారు పెద్దతండాలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై చిర్ర రమేశ్‌బాబు కథనం మేరకు.. తండాకు చెందిన బాదావత్ శేఖర్ (21), భూక్యా రాములు (45) కలిసి శుక్రవారం మధ్యా హ్నం మేచరాజుపల్లి శివారు కుమ్మరికుంటలో చేపలు పట్టేందుకు వెళ్లారు.
చేపల కోసం వేసి న వలను బయటకు లాగుతుండగా ప్రమాదవశాత్తు శేఖర్ గుంతలో పడి మునిగి పోతుండగా, అతడిని కాపాడేందుకు రాములు యత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు. రాత్రి 9 గంటలైనా ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు, తండావాసులు కుంట వద్దకు వెళ్లి వెతకగా అక్కడ వారిద్దరి బట్టలు, చెప్పులు కనిపించాయి. సెల్‌ఫోన్‌కు కాల్ చేస్తే ఎవరూ మాట్లాడకపోవడంతో తండావాసులు గుంతలో వెతకగా ఇద్దరి మృత దేహాలు లభ్యమయ్యాయి. మృతుడు బాదావత్ శేఖర్ తండ్రి భద్రు శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.