బయ్యారం జులై 17 : ఆంధ్రా నుండి తెలంగాణకు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని మహబూబాద్ జిల్లా బయ్యారం పోలీసులు పట్టుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలను గార్ల బయ్యారం సీఐ రవికుమార్ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మంచిర్యాలలోని రాజీవ్ నగర్‌కు చెందిన పర్లపల్లి రాజు, వేల్పుల శాంతి కుమార్, హుజురాబాద్ కు చెందిన రాజు జల్సాలకు అలవాటు పడి ఖర్చులకోసం గంజాయి వ్యాపారం నిర్వహించాలని నిశ్చయించుకున్నారు.
ఈ క్రమంలోఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం సమీపంలో గల గోరాపూర్ లో గంజాయిని తీసుకువచ్చేందుకు రాజు, శాంత కుమార్ వెళ్లారు. గంజాయి ప్యాకెట్లను తీసుకొని ట్రైన్ లో తిరిగి వస్తూ ఉండగా పోలీసులు తనిఖీ చేస్తున్నారనే విషయం పసిగట్టి ఖమ్మం దాటిన అనంతరం గార్ల రైల్వే స్టేషన్లో ఇద్దరు గంజాయి ప్యాకెట్లతో దిగిపోయారు. అనంతరం వాటిని తీసుకొని ఆటోలో బయ్యారం మండలం గంధంపల్లి బస్ స్టాప్ కి చేరుకొని అక్కడి నుండి మహబూబాబాద్ వెళ్లేందుకు బస్టాండ్ వద్ద వెయిట్ చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో బయ్యారం ఎస్ఐ తిరుపతి వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానస్పదంగా లగేజ్ బ్యాగ్ తో ఉన్న ఇద్దరు వ్యక్తులు పోలీసులు చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంబడించి వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించడంతో గంజాయి తరలిస్తున్నట్లు నేరాన్ని ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. వారి వద్ద నుండి 5.385 కిలోల గంజాయి ని స్వాధీనం చేసుకొని, రెండు మొబై ఫోన్లు సీజ్ చేశామన్నారు. గంజాయి ముఠాను పట్టుకోవడం పట్ల ప్రతిభ కనబరిచిన ఎస్ఐ తిరుపతి సిబ్బందిని, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కోకేన్, డీఎస్పీ తిరుపతిరావు అభినందించినట్లు తెలిపారు.