కేసముద్రం, ఏప్రిల్ 5 : ఒకప్పుడు రాష్ట్రంలోనే పసుపు పండించడంలో నంబర్ వన్‌గా ఉన్న కేసముద్రం ప్రాంతంలో ఏటా సాగు విస్తీర్ణం తగ్గుతున్నది. మరోవైపు మార్కెట్లో సరైన ధర లభించకపోవడంతో రైతులు దిగాలులో ఉన్నారు. దశాబ్దం క్రితం తెలంగాణ రాష్ట్రంలోనే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పరిసర గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పసుపు సాగయ్యేది. పది మాసాల క్రితం కోటి ఆశలతో రైతులు పసుపు సాగు చేశారు. వారం రోజుల నుంచి దిగుబడులు వస్తుండడంతో ఏరుతున్నారు.
2009లో క్వింటాలు పసుపునకు రూ.14 వేలు ధర లభించేది. నాడు కేసముద్రం మండలంలో సుమారు 5 వేల ఎకరాల వరకు సాగయ్యేది. కొన్నేళ్లుగా క్వింటాలుకు రూ.10 వేలకు మించి ధర లభించకపోవడంతో పసుపు సాగును రైతులు తగ్గించారు. దిగుబడులు పరిశీలిస్తే పదేళ్ల క్రితం ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు వచ్చేది. కొన్నేళ్లుగా పంటల సాగులో రసాయన ఎరువుల వినియోగం పెరగడం, ముఖ్యంగా గడ్డి మందు వాడకంతో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. దీంతో ప్రస్తుతం ఎకరాకు ఏడు క్వింటాళ్లకు మించి రావడంలేదు. కనీసం విత్తనం కొమ్ము సైతం వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఒకప్పుడు ప్రతి గ్రామంలో వందలాది ఎకరాల్లో రైతులు పసుపు సాగు చేసేవారు. దీని ద్వారా వచ్చిన ఆదాయంతో ఇండ్లు కట్టడం, భూములు కొ నడం చేసేవారు. బంగారం పండించిన పసుపు పంట విస్తీర్ణం తగ్గుతున్నది. దశాబ్దం క్రితం వేల ఎకరాల్లో సాగైన పసుపు పంట నేడు వందల ఎకరాలకే పరిమితమైంది. సాగు విస్తీర్ణం తగ్గిపోవడానికి ప్రధాన కారణం దిగుబ డి తగ్గి, ధర రెండు లేకపోవడమే. వాతావరణం అనుకూలించకపోవడం, కొమ్ములు పెరిగి దుంపలుగా మారుతున్న సమయంలో అగ్గి తెగుళ్లు , దుం పకుళ్లు, కమ్మాకు తెగుళ్లు ఆశిస్తుండడంతో రైతులు విరక్తి చెందారు. మరోవైపు మార్కెట్లో ధర లేకపోవడంతో సాగు తగ్గిస్తున్నట్లు చెబుతున్నారు.
ఎకరం పసుపు పంటను సాగు చేసి దిగుబడి వచ్చే సుమారు రూ.60 వేల పైబడి పెట్టుబడి అవుతుంది. దీనికితోడువాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, భూమి పై గడ్డి మందులు పిచుకారి చేయడం, పశువుల ఎరువు లేకపోవడం వంటి కారణాలతో భూమిలో పోషకాలు లేక దిగుబడిపై ప్రభావం చూపుతున్నది. పెట్టుబడి పెరిగి దిగుబడులు తగ్గుతుండడంతో పసుపు సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.
ఎకరం భూమిలో విత్తనం కొమ్ముతో కలిసి రూ.58 వేల వరకు పెట్టుబడి పెట్టాను. ఈ సారి కలిసి వస్తుందనే ఆశతో భూమిని కౌలుకు తీసుకొని సాగు చేశా. పంట పండగా దున్నుతే విత్తనం కొమ్ము కూడా వచ్చే పరిస్థితి లేదు. కనీసం ఎకరం భూమిలో కేవలం 4 నుంచి 5 క్వింటాళ్ల వరకే దిగుబడి వచ్చింది. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆర్థికంగా నష్టపోయాను.
– దేవరబోయిన వెంకటయ్య, కల్వల రైతు