హనుమకొండ, మార్చి 17: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం 27 ఏప్రిల్ 2001లో జరిగింది. ఆవిర్భవించిన రెండు నెలల్లోనే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా ఉద్యమసారథి కేసీఆర్ దార్శనికతతో స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ జనం తీర్పు కోసం అధినేత నిర్ణయంతో ఎన్నికలకు వెళ్లింది. అధినేత నిర్ణయం మేరకు 2001 జూలై 3న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ అభ్యర్థులను పోటీలో నిలిపింది.
రైతునాగలి గుర్తుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయగా టీఆర్ఎస్కు తెలంగాణ సమాజం బ్రహ్మరథం పట్టింది. ఆ ఎన్నికల్లో 82మంది జడ్పీటీసీలు, వందలాది ఎంపీటీసీలతో జయకేతనం ఎగురవేసింది. ఆ ఎన్నికల్లో నర్సంపేట, నల్లబెల్లి స్థానం నుంచి జడ్పీటీసీగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. కాగా అప్పుడు ఎన్నికల ప్రచారం కోసం బ్రష్‌తో రాయించిన బ్యానర్‌ను సిల్వర్ జూబ్లీ వేడుకల నేపథ్యంలో సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఆవిష్కరించారు. ఆనాటి ఉద్యమపంథా, జ్ఞాపకాలను అందరూ గుర్తుచేసుకున్నారు.
రజతోత్సవం సందర్భంగా నాటి టీఆర్ఎస్ రైతు నాగలి గులాబీ జెండాతో ఉన్న బ్యానర్‌ను భద్రపరిచి ఉద్యమ సందర్భాన్ని మరోసారి స్మరించుకునేలా చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి బృందాన్ని అధినేత కేసీఆర్ అభినందించారు. రజతోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజయ్య, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ విప్ దాస్యం వినయ్‌భాసర్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు పాల్గొన్నారు.