కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో గిరిజన రైతులపై రాష్ట్ర ప్రభుత్వ దమనకాండకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. వారికి బాసటగా నిలిచేందుకు గులాబీ దళం పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా 25న (సోమవారం) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహాధర్నాకు సంకల్పించింది. ఉద్యమ సమయంలో తెలంగాణ ద్రోహులను రాళ్లతో తరిమికొట్టిన మానుకోటనే ఇందుకు వేదికగా చేసుకొని రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది.
మొదట ఈ నెల 21న మహాధర్నా నిర్వహించాలనుకున్నప్పటికీ సర్కారు ఒత్తిడితో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో అనుమతినివ్వగా, శాంతియుత ధర్నాలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఆదివారం ధర్నా స్థలిని పరిశీలించారు. జిల్లాలోని గిరిజనులు, రైతులు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
– మహబూబాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన రైతులపై చేస్తున్న దాడులను నిరసిస్తూ బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. మానుకోట గడ్డ నుంచి రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది. కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో తమ భూములు ఇవ్వమని ఖరాకండిగా తేల్చిచెప్పిన గిరిజన రైతులను రాష్ట్ర సర్కారు పోలీసులతో అతి దారుణంగా కొట్టించి, అక్రమ కేసులు పెట్టి జైల్లోకి నెట్టింది. దీనిని నిరసిస్తూ కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నది. ఈ క్రమంలో గిరిజనులు అధికంగా ఉన్న మానుకోట జిల్లాలో ధర్నా నిర్వహించాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో మహాధర్నా చేపట్టేందుకు నిర్ణయించారు.
ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరుకానున్నారు. ముందుగా ఈనెల 21న ధర్నా నిర్వహించేందుకు నిర్ణయించగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సైతం కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామని బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ధర్నాను తాతాలికంగా వాయిదా వేశారు. అనంతరం జిల్లా నేతలు హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 25న ఉదయం 11 నుంచి మధ్యా హ్నం రెండు గంటల వరకు మహాధర్నాకు అనుమతినిచ్చింది.
దీంతో బీఆర్ఎస్ శ్రేణులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. గిరిజన రైతుల్లో మనోధైర్యం నింపి, అండగా నిలవాలనే ఉద్దేశంతో మానుకోటలో మహాధర్నా నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి కేటీఆర్ బయలుదేరి 10గంటలకు మానుకోటకు చేరుకొని మహాధర్నాలో పాల్గొన్న అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారు. జిల్లాలోని గిరిజనులు, రైతులు స్వచ్ఛందంగా తరలిరావాలని బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పిలుపునిచ్చారు.
ధర్నా స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పట్టణంలోని ధర్నా నిర్వహించే ప్రాంతాన్ని ఆదివారం మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీలు తకళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ, పార్టీ అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, జడ్పీ మాజీ చైర్పర్సన్ అంగోతు బిందు, బీరవెల్లి భరత్ కుమార్‌రెడ్డి తదితర నాయకులు పరిశీలించారు.