నడికూడ, జూన్ 2 : చెరువులో పడిన బాలుడిని రక్షించబోయిన వ్యక్తి చిన్నారి తో పాటు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని రాయపర్తి గ్రామంలో చోటుచేసుకుంది. పరకాల పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాయపర్తి గ్రామానికి చెందిన కూనారపు సురేందర్ (45) వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. సోమవారం తన ఇద్దరు కుమారులతో కలిసి చెరువులో చేపల వేటకు వెళ్లాడు.
అదే గ్రామానికి చెందిన వీర్ల రాజమౌళి కుమారుడు హర్షవర్ధన్ (12) చెరువులో ఆడుతూ లోతు ఉన్న చోటు కు వెళ్లి మునిగిపోతున్నాడు. ఈ క్రమం లో సురేందర్ బాలుడిని రక్షించడానికి వెళ్లగా ఈత రాని హర్షవర్ధన్ భయంతో గట్టిగా పట్టుకోవడంతో అతడు కూడా నీటిలో మునిగిపోయాడు. గట్టుమీద ఉన్న సురేందర్ పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకుని చెరువులోకి దిగి అప్పటికే మృతి చెందిన ఇద్దరి మృతదేహాలను బయటికి తీశారు. ఎస్సై రమేశ్నాయక్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని పంచనామా చేసి పోస్టుమార్టానికి పంపించారు.