కేసముద్రం, మే 15: ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు పంటను అమ్ముకోవడం కూడా కష్టంగా మారింది. ఇప్పటికే ధరల హెచ్చు తగ్గులతో తీవ్రంగా నష్టపోతుండగా, పంటను అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. మిల్లుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో కేసముద్రం మార్కెట్కు వేరుశనగను తరలించిన రైతులు కొనుగోలు చేయాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపారులను ప్రాధేయపడినా ఎవరూ ముందుకు రాలేదు. మండలంలోని పెనుగొండకు ముదిగిరి కుమారస్వామి 15బస్తాలు, మరో రైతు సుధాకర్ 15బస్తాల వేరుశనగను కేసముద్రం మార్కెట్కు బుధవారం విక్రయించేందుకు తీసుకువచ్చి రాసులు పోశారు. ఉదయం ఈ-నామ్ ద్వారా వ్యాపారులు వేయగా అధికారులు మధ్యాహ్నం టెండర్ విడుదల చేశారు. టెండర్లో వేరుశనగను ఏ వ్యాపారి ఖరీదు చేయలేదు. దీంతో రైతులు మార్కెట్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేయగా వ్యాపారులను అడగాలని సూచించారు. రైతులు మిల్లుల వద్దకు వెళ్లి వేరుశనగను కొనుగోలు చేయాలని కోరగా కొందరు నిరాకరించారు. మరికొందరు క్వింటాల్కి రూ.4వేల చొప్పున ఖరీదు చేస్తామని చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసి ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో చేసేదేమీ లేక వేరుశనగను రైతులు మళ్లీ బస్తాల్లో నింపుకొని ఇళ్లకు తీసుకెళ్లారు.
పంట పండించడం ఒక ఎత్తయితే పంట అమ్ముకోవడం మరో ఎత్తవుతున్నది. మార్కెట్లో వేరుశనగను ఎవరూ ఖరీదు చేయకపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మిల్లుల వద్దకు వెళ్లి అడిగితే తక్కువ ధరకు కొంటామంటున్నరు. ఎకరానికి 10 క్వింటాళ్లకు పైగా దిగుబడి రావాల్సి ఉండగా, 5 వచ్చింది. దిగుబడి తగ్గి నష్టపోగా, ధర లేకపోవడం, వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో సాగుచేయడం భారంగా మారుతోంది. మద్దతు ధర పెట్టిన పెట్టుబడి రాక ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. మద్దతు ధర చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది.
– ముదిగిరి కుమారస్వామి, పెనుగొండ రైతు