‘ఆత్మహత్య అనేది దురదృష్టకర ఘటన. ప్రజా ఉద్యమంలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అందుకు సారీ. కానీ ఆ ఆత్మహత్యలకు అప్పటి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించదు’
– ఈ నెల 16న హైదరాబాద్‌లో కాంగ్రెస్ ముఖ్య నేత చిదంబరం వ్యాఖ్యలు
.. ఇలా బాధ్యత మరిచి నాటి కేంద్ర మంత్రి, నేటి కాంగ్రెస్ నేత పీ చిదంబరం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ అమరుల కుటుంబాలు మండిపడుతున్నాయి. తెలంగాణ ఆత్మ బలిదానాలకు కాంగ్రెస్ కారణం కాదా అని నిలదీస్తున్నాయి. ఆ పార్టీ తెలంగాణ ఇవ్వకుండా మోసం చేయడం వల్లే తమవాళ్లు ప్రాణాలు అర్పించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రం ఇస్తామని చెప్పి ప్రకటన వెనక్కి తీసుకోవడం వల్లే ఇంతమంది ఆత్మార్పణ చేస్కున్నారని, ఇందుకు కచ్చితంగా కాంగ్రెస్సే బాధ్యత వహించాలని తెగేసి చెబుతున్నాయి. తమవారి బలిదానాలకు విలువలేకుండా ఉత్త సారీతో సరిపెట్టిన కాంగ్రెస్‌కు పుట్టగతులు ఉండవని తిట్టిపోస్తున్నాయి.
కాంగ్రెస్ నేత చిదంబరం వ్యాఖ్యలపై తెలంగాణ అమరుల కుటుంబాలు భగ్గుమంటున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి, మళ్లీ మాట మార్చడం వల్లే ఎంతోమంది బిడ్డలు బలిదానం అయ్యారని ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆత్మహత్యలకు తమ పార్టీకేమీ సంబంధం లేదని అమరుల త్యాగాలను చులకన చేయడం చాలా బాధించిందని చెబుతున్నారు. చిదంబరం ఇలా బాధ్యతారహింగా మాట్లాడి సారీ చెబితే సరిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. చెప్పినట్టు అప్పుడే రాష్ట్రం ఇస్తే ఇంతమంది ఆత్మార్పణం చేసుకునేవాళ్లు కాదు కదా..? ఇప్పుడు సారీ చెబితే వాళ్ల ప్రాణాలు తిరిగి వస్తయా? అని నిలదీస్తున్నారు. దీనికంతటికి కారణం కాంగ్రెస్సేనని ఆ పార్టీకి అమరుల ఉసురు తప్పక తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. వారి త్యాగాలపై నోరుపారేసుకున్న చిదంబరం బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎల్కతుర్తి : మాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. గుంట భూమి, ఉండడానికి ఇల్లు కూడా సరిగ్గా లేదు. మా కులవృత్తి కల్లు గీత పనినే నమ్ముకుని బతుకుతున్నం. మా పెద్ద కొడుకు కుమారస్వామి ఇంటర్ చదివి ఊరిలోనే పనులు చేసేది. తెలంగా ణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడు. నిత్యం తెలంగాణ గురించే మాట్లాడే వాడు. అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో ఇక తెలంగాణ వస్తదని సంబురపడ్డడు. ఇంతల కాంగ్రెస్ పార్టీ మాట మార్చడం వల్ల ఇక తెలంగాణ రాదని బాధపడ్డడు. 2010 మార్చి 6న ‘నా చావుతోటైనా తెలంగాణ రావాలె’ అని రాసి పురుగుల మందు తాగి బలిదానం అయిండు. గప్పుడు మా కొడుకు లెక్క ఎంతోమంది పానం తీసుకున్నరని టీవీల్లో చూసినం. తొలుసూరు బిడ్డ గిట్ల పోయిండ ని కుమిలికుమిలి ఏడ్చినం. ఇత్తామని చెప్పినప్పుడే తెలంగాణ ఇచ్చుంటే మా కొడుకు బతికుండేది. గిప్పుడేమో మా పార్టీకి సంబంధం లేదని వాళ్లు చెప్పడం బాధగా ఉంది. గిప్పుడు సారీలు చెప్తే పోయిన మా బిడ్డ తిరిగివస్తడా. ఉద్యమంలో బిడ్డను పోగొ ట్టుకున్న మాకు అప్పటి ఉద్యమ సమాజం అండగా నిలిచింది. కేసీఆర్ సర్కారు ఆదుకోకుంటే మా కుటుంబం ఆగమైతుండే.
నర్సింహులపేట, నవంబర్ 18 : తెలంగాణ అమరులంటే కాంగ్రెస్ నాయకులకు ఇంత చులకన భావం ఎందుకు?. సారీ చెప్పి ఆత్మహత్యలకు మా పార్టీతో సంబంధం లేదని చిదంబరం చెప్పడం సరికాదు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చి ఉంటే మా బాబాయి బతికేవాడు. తెలంగాణ కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి వెనక్కి తీసుకోవడంతో ఉద్యమం తీవ్రమైంది. అప్పుడు కేసీఆర్ సార్‌ను అరెస్టు చేసి ఖమ్మం తరలిస్తున్న సమయంలో పెద్దనాగారం స్టేజీ దగ్గర రోడ్డుపై యువకులతో పాటు మా బాబాయి భూక్య ప్రవీణ్‌నాయక్ రాస్తారోకో చేశారు. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి వెనుకకు తీసుకోవడం వల్ల తెలంగాణ రాదేమోనని బాధపడి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నడు. ఆ సమయంలో తెలంగాణ అంటేనే పోలీసులు దెబ్బలు కొట్టేవారు. అప్పుడు మా బాబాయితో పాటు చాలామంది బలిదానం అయ్యారు. ఎంతోమంది చావుకు కారణమైన వారు ఇప్పుడు తెలంగాణలో చనిపోయిన అమరవీరులకు మాకు సంబంధం లేదని, చిన్న సారీతో సరిపెట్టిన చిదంబరానికి చా వంటే ఇంత చులకనగా ఉందా? కేసీఆర్ సారు చేసిన పోరాటం వల్ల ఏర్పడిన తెలంగాణలో మాలాంటి కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయంతో పాటు మా నాన్న దేవ్‌సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. మా బాబాయి లేడనే బాధ ఉన్నప్పటికీ మా నానమ్మ, మా కుటుంబానికి పెద్ద భరోసా ఇచ్చారు కేసీఆర్ సార్.
రేగొండ, నవంబర్ 18 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అందరి జీవితాలు బాగుపడతాయని కలలుగన్న కుటుంబాల్లో మా కుటుంబం ఒకటి. ఎందరో ఆత్మబ లిదానాలతోనే తెలంగాణ వచ్చింది. మా కొడుకు తెలంగాణ కోసం అమ రుడైనందు కు ఒక వైపు గర్వంగా ఉన్నా మరోవైపు మొన్న కాంగ్రెస్ నేత చిదంబరం చేసిన వ్యా ఖ్యలు వింటే గుండె తరుక్కుపోయింది. తెలంగాణ బలిదానాలకు కాంగ్రెస్ బాధ్యత వహించదని అనడం బాధగా ఉంది. వారి త్యాగాలను అవమానించినట్టు మాట్లాడ డం తగదు. సారి అని చెబితే చనిపోయిన తెలంగాణ బిడ్డలు ఇప్పడు తిరిగి వస్తారా?, చెప్పినట్టే అప్పుడే తెలంగాణ ఇచ్చి ఉంటే బలిదానాలు జరిగేవి కాదు కదా?, కానీ ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. చిదంబరం తెలంగాణ అమరుల కుటుంబాలకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇలాంటి మాటలతో మా ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీస్తున్నారు. కాంగ్రెస్ నేతలంతా ఇంకా ఏ మొఖం పెటుకొని ఓట్లు ఆడుగుతున్నారు. అమరుల బాధ్యత లేదని జారుకోవడం సరైన పద్ధతి కాదు. అవాకులు చెవాకులు పేలితే కాంగ్రెస్‌ను పాతరేస్తాం. అమరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మాకు అండగా నిలిచి ధైర్యం నింపారు.
ములుగు, నవంబర్18 (నమస్తే తెలంగాణ) : 2009కి ముందే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చి ఉంటే ఇయ్యాల మా కొడుకు కండ్లముందు ఉంటుండె. మాట మార్చకపోతే మా కొడుకు బతికి ఉంటుండె కదా. అప్పటి బలిదానాలకు కాంగ్రెస్సే కారణం. కానీ ఇప్పుడు చిదంబరం తెలంగాణ ఇచ్చుడు కొంత ఆలస్యం అయింది సారీ అని చెప్పడం కరెక్టేనా. తెలంగాణ కోసం బలైన ప్రాణాలు మళ్ల తిరిగి వస్తయా. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడుతాయి నాన్న అని నా కొడుకు రాజ్‌కుమార్ అప్పుడు చెప్పెటోడు. గణపురంలో ఇంటర్ చదువుతూ కేసీఆర్ దీక్ష చేస్తున్నడని తెలిసి హైద్రాబాద్‌కు పోయిండు. అక్కడ ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొన్నాడు. కొన్ని రోజులకు ఇంటికి వచ్చిన నా కొడుకు ఊకె రందితోటి ఉండేది. పానం ఏమైన బాగలేదేమో అనుకొని నేను, నా భార్య వ్యవసాయ పనులకు వెళ్లేది. ఒకరోజు నా కొడుకు ఊళ్లో దోస్తులకు తెలంగాణ రాకుంటే మన బతుకులు బాగుపడవు, తెలంగాణ వస్తనే మంచిది అని ఊకె అనుకుంటూ బాధపడే వాడని చనిపోయినంక తెలిసింది. డిసెంబర్ 3న నా భార్య పొలం కాడికి, నేను బంధువుల పెండ్లికి పోయినం. ఇంతలో నా కొడుకు ‘నా చావుతోనైనా తెలంగాణ రావాలి’ అని లెటర్ రాసి ఇంట్లో ఉరేసుకొని చనిపోయిండు. 2009కంటే ముందే చేస్తున్న ఉద్యమాన్ని అర్థం చేసుకొని ప్రత్యేక రాష్ర్టాన్ని ఇచ్చి ఉంటే నా కొడుకుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ప్రాణాలు నిలబడేవి. వాళ్లందరు బతికి ఉంటే సంతోషంగా నౌకరీ చేసుకుంటూ పిల్లాపాపలతో సంతోషంగా ఉండేవారు. ఈ పాపం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానిదే. కొడుకు లేడనే బాధ నేను సచ్చేదాక ఉంటది. కానీ సీఎం కేసీఆర్ అండగా ఉండి చిన్న కొడుకుకు నౌకరీ ఇచ్చి మా కుటుంబాన్ని నిలబెట్టిండు.
జయశంకర్ భూపాలపల్లి. నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ నేత చిదంబరం తెలంగాణ అమరులను అవమానించేలా మాట్లాడుతున్నడు. అసలు రాష్ట్రం ఇవ్వడం వారికి ఇష్టమే లేదు. కేసీఆర్ ఉద్యమ ధాటికి తట్టుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారు. వారికి రాష్ట్రం ఇవ్వడం ఇష్టం లేదని చిదంబరం మాటలను బట్టి అర్థమవుతోంది. తెలంగాణ ప్రకటన వెనక్కి తీసుకోవడం వల్ల ఎంతోమంది మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరందరి బలిదానాలకు కాంగ్రెస్ కారణం కాదా. మా అన్న శ్రీనివాసాచారి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడు. గ్రామంలో ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తూ, పౌరోహిత్యం చేసేది. ఉద్యమంలో ముందంజలో ఉండేవాడు. కాంగ్రెస్ తీరుకు విసుగు చెంది ఇక తెలంగాణ రాదేమో అని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇచ్చి రూ.10 లక్షలు ఇచ్చింది. ఆనాడు కాంగ్రెస్ సకాలంలో స్పందించి రాష్ట్రం ఇస్తే మా అన్న బతికేవాడు. చిదంబరం నోటికి వచ్చినట్లు మాట్లాడి సారీ అంటే సరిపోతుందా.
వరంగల్ చౌరస్తా, నవంబర్ 18 : తెలంగాణ వస్తుందని ఆశపడ్డ జనాల నెత్తిన గుదిబండ వేసినట్టు కాంగ్రెస్ నాయకులు మాట మార్చడంతో మా నాన్న ఒక్కసారిగా కుంగిపోయాడు. నమ్మిన ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్న బాధతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నడు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ అందరం చూస్తుండగానే అగ్నికి ఆహుతయ్యిండు. అదే రందితో మా అమ్మ సువర్ణ కూడా ఆరు నెలలు తిరగకుండానే కాలం చేసింది. రాజకీయ లబ్ధి కోసం మాటలు మార్చిన కాంగ్రెస్ నేడు తప్పు జరిగింది గానీ బాధ్యత మాది కాదంటూ మాట మార్చి అమరుల ప్రాణత్యాగాలకు కారకులం కాదనడం మరో ద్రోహం. ఈ మాటలు వారి ఆత్మ బలిదానాలను అవమానించడమే అవుతుంది. కాంగ్రెస్ చేసిన ద్రోహపూరిత మాటల వల్లే నేడు నాలాంటి చాలామంది అనాథలుగా మారి ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ చేసిన ద్రోహానికి బలైన మాలాంటి కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం అక్కున చేర్చుకొని ఆదుకుంది. అర్హతలను బట్టి అమరుల కుటుంబాలకు ఉద్యోగాలను కల్పించి తగిన న్యాయం చేసింది.