ములుగు జిల్లాలో గతంతో పోల్చితే సాగు పనులు వెనుకబడిపోయాయి. గత నాలుగేళ్లలో జూన్, జూలై మాసాల్లో వర్షాలు విస్తారంగా కురిసి చెరువులు మత్తడులు పడితే ఈ ఏడాది మాత్రం ఆశించిన వర్షాలు కురవక చెరువులు ఎండిపోయి కనిపిస్తున్నాయి. ములుగు జిల్లాలో అత్యధికంగా వరి సాగు చేస్తుంటారు. 90శాతం, చెరువులు, కుంటల కింద రైతన్నలు వ్యవసాయ పనులు చేసుకుంటుండగా 10శాతం రైతులు మాత్రం బోర్లు, ఇతర నీటి వనరుల ద్వారా వ్యవసాయ పనులు కొనసాగిస్తున్నారు. జిల్లాలో కాకతీయుల కాలం నాటి రామప్ప, లక్నవరంతో పాటు జిల్లా కేంద్రంలోని లోకం చెరువులోకి ఈ వానకాలంలో అనుకున్న మేర కొత్త నీరు రాలేదు. వర్షపాతం లేకపోవడంతో ఆయా చెరువుల్లో నీరు కనుచూపు మేర దూరంలో కనిపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో అన్ని చెరువుల కంటే ముందుగా నిండుకునే లక్నవరం సరస్సు సైతం నేడు బోసిపోయి కనిపిస్తున్నది.