నమస్తే నెట్వర్క్, మే 2 : ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఇది కొనసాగింది. దీంతో కోతకొచ్చిన వరి పంట నేలవాలగా, మామిడి కాయలు రాలిపోయాయి. గాలుల ధాటికి రోడ్లపై భారీ చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వందల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.
దీంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇండ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో బాధితులు రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మక్కలు, మిర్చి తడిసిపోయాయి. పలు కొనుగోలు కేంద్రాల్లో వర్షపు నీటిలో ధాన్యం మునగడంతో పాటు కొట్టుకుపోవడంతో రైతులకు తీవ్ర నష్టం మిగిలింది.
నీళ్లను తొలగించేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, కురవి, డోర్నకల్, గూడూరు, బయ్యారం, గార్ల, మరిపెడ, భూపాలపల్లిలోని మహదేవపూర్, కాటారం, ములుగులోని ఏటూరునాగారం, గోవిందరావుపేట, వెంకటాపూర్, వరంగల్లోని నర్సంపేట, చెన్నారావుపేట, ఖానాపురం, హనుమకొండ జిల్లాలోని శాయంపేట, కమలాపూర్ మండలాల్లోని పలు గ్రామాలు ఈదురుగాలులు, వర్షం బారిన పడ్డాయి.