మహబూబాబాద్ రూరల్, మే 7 : మక్క రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. గురువారం మహబూబాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మక్కలు పండించిన రైతులు మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో పోసుకొని నెల రోజులుగా ఎదురు చూస్తున్నా కాంటాలు కావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ పేరిట రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలని ఓరుగల్లు కేంద్రంగా రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తే అనేక మంది అన్నదాతలు హాజరయ్యారన్నారు.
సదస్సు సక్సెస్ కావడాన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్, కేటీఆర్ పైన తమ అక్కసును వెళ్లగక్కుతున్నారన్నారు. ఇష్టారీతిన మాట్లాడుతన్న కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని, చిల్లర రాజకీయాలు చేయొద్దని, పిచ్చి కూతలు, రండ మాటలు వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. ముందునుంచే కార్యక్రమానికి అనేక అడ్డంకులు సృష్టించారని, ఏ ఒక్క గ్రౌండ్లో కూడా అనుమతి లేకుండా చేశారని, ఎన్ని ఒత్తిడులు, బెదిరింపులు వచ్చినా సదస్సును విజయవంతం చేశామన్నారు. కాంగ్రెసోళ్లు ఎన్ని కేసులు పెట్టినా రైతుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామన్నారు.
బీఆర్ఎస్ పెట్టిన సదస్సుకు వేల మంది రైతులు స్వచ్ఛందంగా వస్తే పోటీగా పెట్టిన కాంగ్రెస్ రైతు మేళాకు ఆదరణ కరువై ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయన్నారు. ప్రభుత్వం రైతు మేళా పేరిట సంబురాలు కాకుండా రైతుల కాంటాల పైన దృష్టి పెట్టాలన్నారు. కాంగ్రెస్ నాయకులు ఏసీ గదుల్లో కూర్చొని మాట్లాడడం కాదని, మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలకు వస్తే రైతుల సమస్యలు తెలుస్తాయన్నారు. రైతు సంగ్రామ సదస్సును విజయవంతం చేసిన రైతులు, బీఆర్ఎస్ శ్రేణులకు తక్కళ్లపల్లి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, జెర్రిపోతుల వెంకన్న, మార్నేని రఘు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.