దృష్టి లోపాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగును ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షల ఆధారంగా కండ్ల అద్దాలు ఇవ్వడం, అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈనెల 18 నుంచి నిర్వహించనున్న రెండో విడుతకు జిల్లాలో 44 బృందాలను అధికారులు నియమించారు. వరుసగా 100 పని దినాల్లో ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. గ్రామాల్లో రోజుకు 300 మందికి, పట్టణాలు, నగరాల్లో 400 మందికి కంటి పరీక్షలు చేసేలా ప్రణాళిక రూపొందించారు. కాగా, జిల్లాలో మొదటి విడుత 3,24,644 మందికి పరీక్షలు చేశారు. వీరిలో 52,718 మందికి దగ్గరి చూపు అద్దాలు, 44,122 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలు అందజేశారు. మరో 25,072 మందిని ఆపరేషన్ కోసం దవాఖానలకు సిఫారసు చేశారు.
– వరంగల్, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సర్వేంద్రియానం… నయనం ప్రధా నం. అన్ని అవయవాల్లో కండ్లు చాలా ముఖ్యమైనవి. కంటి చూపు మనిషి జీవితానికి, మనుగడకు చాలా ప్రధానమైనది. చిన్న కారణాలతో కంటి చూపు సమస్యలతో ఇబ్బంది పడే వారు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా పేదలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారు అవగాహన లేక, ఆర్థిక ఇబ్బందులతో కంటి పరీక్షలు చేసుకోరు. ఇలాంటి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టింది. అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంతో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి చూపు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. పరీక్షల ఆధారంగా కండ్ల అద్దాలను ఇవ్వడం, అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించడం కంటి వెలుగు కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
మొదటి దశ కార్యక్రమాన్ని 2018 ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 2019 జనవరి వరకు ఐదు నెలల 15 రోజులపాటు పరీక్షలు నిర్వహించింది. కంటి వెలుగు రెండో దశను జనవరి 18 నుంచి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వరుసగా 100 పని దినాలలో ప్రత్యేకంగా క్యాంపులు పెట్టి అవసరమైన అందరికీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతి గ్రామం, పట్టణం, నగరంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నది. గ్రామాల్లో రోజుకు 300 మందికి… పట్టణాలు, నగరాల్లో రోజుకు 400 మందికి కంటి పరీక్షలు చేసేలా ప్రణాళిక రూపొందించింది. కంటి పరీక్షల నిర్వహణ కోసం జిల్లాల వారీగా ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసింది.
ప్రక్రియ ఇలా…
కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా అవసరమైన ప్రతి ఒక్కరికీ కంటి చూపు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల ఆధారంగా మందులను, కండ్ల అద్దాలను ఉచితంగా ఇస్తారు. తీవ్రమైన కంటి వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరిస్తారు. ప్రతి గ్రామం, పట్టణంలో వార్డులు, డివిజన్ల వారీగా క్యాంపులను ఏర్పాటు చేస్తారు. వారంలో ఐదు రోజులపాటు పొద్దున 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరు క్యాం పులను నిర్వహిస్తారు. ప్రభుత్వ సెలవు దినాలు, వారాంతపు రోజుల్లో క్యాంపులు ఉండవు. మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలో 8 మందితో ఒక బృందం క్యాంపులను నిర్వహిస్తుంది. కండ్ల డాక్టర్, సూపరింటెండెంట్, ఇద్దరు ఏఎన్ఎంలు, ముగ్గురు ఆశ వర్కర్లు, ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్ ఈ బృందంలో ఉంటారు. ప్రతి బృందానికి కంటి పరీక్ష యంత్రం, ట్రయల్ బాక్స్ ఉంటాయి.
కంప్యూటర్తో అనుసంధానం చేసిన ఏఆర్ మెషిన్లతో కంటి పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్షల ఆధారంగా వివరాలను ఏఎన్ఎంలు వెంటనే ట్యాబు ల్లో నమోదు చేస్తారు. మందులను, రీడింగ్ అద్దాలను అక్కడే ఇస్తారు. చూపు సమస్యలు ఉన్న వారికి రెండు వారాల్లో అద్దాలను ఇస్తారు. గ్రామాల్లో పంచాయతీరాజ్, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ శాఖల సిబ్బంది క్యాంపుల నిర్వహణ ఏర్పాట్లను చేస్తారు. కంటి వెలుగు శిబిరాలకు ఆయా ప్రాంతాల్లోని అందరినీ తీసుకొచ్చేలా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
కంటి వెలుగు ఇలా..
వరంగల్ జిల్లాలో 9.97 లక్షల జనాభా ఉన్నది. వీరిలో 18 ఏండ్లు నిండిన అందరికీ కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 323 గ్రామ పంచాయతీలు, 70 డివిజన్లు/వార్డులు ఉన్నాయి. కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 44 బృందాలను సిద్ధం చేసింది. కంటి వెలుగు మొదటి దశలో వరంగల్ జిల్లాలో 3,24,644 మందికి పరీక్షలు చేసి, 96,840 మందికి అద్దాలను ఇచ్చారు. వీరిలో 52,718 మందికి దగ్గరి చూపు సంబంధించిన అద్దాలు, 44,122 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలు పంపిణీ చేశారు. మరో 25,072 మందికి కంటి ఆపరేషన్ల కోసం ఆస్పత్రులకు సిఫారసు చేశారు.