ములుగు జిల్లాలో రైతుల అవస్థలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇక్కడ సాగు నీటి కష్టాలు, విద్యుత్ ఇబ్బందులు లేనప్పటికీ పంట సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా రాక అన్నదాతలు గోసపడుతున్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సాగు సమయానికి ఖాతాలో జమైన రైతుబంధు.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రాక రైతులు అప్పుల పాలవుతున్నారు. కష్టాలకోర్చి పంట పండిస్తే సరైన దిగుబడి రాక.. వచ్చినా మార్కెట్లో సరైన ధర లేక ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా వరి, మిర్చి, మక్కజొన్న, పత్తి సాగుచేస్తున్న ఒక్కో రైతుది ఒక్కో దీనగాథ. సన్న రకం ధాన్యానికి బోనస్ బోగస్‌గా మారగా, మిర్చికి ధర లేక, మక్కజొన్న పంట నష్టం తేలక దిగాలు చెందుతున్నారు. తాము ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
ములుగు జిల్లాలో అత్యధికంగా 60 వేల ఎకరాల్లో వరి పంట వేయగా, ఇందులో ఎక్కువగా సన్నరకం సాగయ్యింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు క్వింటాకు రూ. 500 చొప్పున బోనస్ డబ్బులు సకాలంలో రైతుల ఖాతాల్లో జమకావడం లేదు. ధాన్యం విక్రయ సమయంలో రైస్ మిల్లర్లు క్వింటాకు 3 నుంచి 5 కిలోల వరకు కోత పెట్టినా అమ్ముకున్నారు. వీటి డబ్బులు బోనస్ రూపంలో వస్తాయని ఆశపడితే చివరకు నిరాశే ఎదురైంది. కొనుగోళ్లు పూర్తయి రెండు నెలలైనా బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో మొత్తం 166 కొనుగోలు కేంద్రాల ద్వారా 6,94,260 క్వింటాళ్ల సన్నవడ్లను అధికారులు కొనుగోలు చేశారు. బోనస్ కింద రైతులకు రూ. 34.71 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ. 24.78 కోట్లు మాత్రమే ఖాతాల్లో జమచేశారు. ఇంకా రూ. 9.92 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటికోసం రైతులు వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.
ములుగు జిల్లాలో ఈ సీజన్లో రైతులు 25,320 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ప్రస్తుతం కోత దశకు చేరుకోగా, నల్లి వైరస్ సోకి మిర్చి పంట ఎండిపోతున్నది. దీంతో ఎకరానికి 18 నుంచి 25 క్వింటాళ్లు వచ్చే దిగుబడి 10 నుంచి 15 క్వింటాళ్లు మించడం లేదు. మార్కెట్లో సైతం ధర లేకపోవడంతో పెట్టుబడి వచ్చే అవకాశం కూడా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రకాన్ని బట్టి మిర్చి క్వింటాకు రూ. 12 వేల ధర పలుకుతున్నది. దీంతో రైతులు ఎకరాకు రూ. లక్ష వరకు నష్టపోతున్నామంటూ వాపోతున్నారు. ములుగు జిల్లాలో మిర్చి మార్కెట్ లేకపోవడంతో వరంగల్ ఎనుమాముల మార్కెట్లో విక్రయిస్తున్నారు. కొందరు రైతులు అడిగిన ధరకు మిర్చిని అమ్మలేక కోల్డ్ స్టోరేజ్‌లో భద్రపర్చుకొని వస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. వారు ఒక ఎకరానికి రూ. 30 వేల నుంచి రూ. 40వేల వరకు అదనపు భారం మోయాల్సి వస్తున్నది. మిర్చికి రూ.16 వేల నుంచి రూ. 20 వేల వరకు మద్దతు ధర ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ములుగు జిల్లాలో వరి, మిర్చి తర్వాత అత్యధికంగా రైతులు మక్కజొన్న సాగు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పలు కంపెనీలకు చెందిన విత్తనాలు విత్తినప్పటికీ ఈ సీజన్లో వాజేడు, కన్నాయిగూడెం, వెంకటాపురం(నూగూరు) మండలాల్లో పంట దిగుబడి రాక రైతులు నష్టపోయారు. ప్రజా సంఘాల నాయకులు, రైతుల పోరాటాలతో జిల్లా యంత్రాంగం స్పందించి వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 414 మంది రైతులు 838 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు అధికారులు గుర్తించినప్పటికీ దీనిపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
నేను నాలుగు ఎకరాల్లో మక్కజొన్న పంట సాగు చేసిన. నకిలీ విత్తనాల కారణంగా పంట చేతికి రాకుండా పోయింది. ఉత్త బెండు మాత్రమే మిగిలింది. మక్కజొన్న పంట సాగు చేయాలంటే ఎకరానికి రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు ఖర్చవుతున్నది. మక్కజొన్న రైతు కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి. నాతో పాటు చాలా మంది రైతులు నకిలీ విత్తనాల కారణంగా నష్టపోయారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలి.
ఈసారి మిర్చి పంటకు తెగుళ్లు సోకి దిగుబడి బాగా తగ్గింది. గతంలో పండు మిర్చి ధర రూ. 45 ఉండగా ఇప్పుడు రూ. 25 పలుకుతున్నది. మిర్చి ఆరబెట్టిన సమయంలో కూలీల ఖర్చు కూడా ఎక్కువవుతున్నది. దీంతో చేసేదేమీ లేక పండు మిర్చిని అమ్ముతున్నా. ఈ సారి మిర్చి రైతులు భారీగా నష్టపోయినట్లే.
మిర్చి పంట పండించిన రైతుల పరిస్థితి ఆగంగా మారింది. గత ఏడాది కంటే సాగు ఖర్చులు పెరుగగా ఇప్పుడు ధర కూడా తగ్గిపోయింది. 3 ఫేజ్ విద్యుత్ సక్రమంగా రావడం లేదు. కోతలు ఉన్నాయి. పంటకు తెగుళ్లు సోకి దెబ్బతిన్నది. మా గోస ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. పంట పండించుడే పాపమైంది.