తెలంగాణలో సంక్షేమ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు పాటు పడుతున్నారు. ఎన్నికల సమయంలో మాటివ్వకున్నా, మేనిఫెస్టోలో లేకున్నా ఎప్పటికప్పడు అవసరాలకు అనుగుణంగా పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో దివ్యాంగులకు ఆసరా పింఛన్ రూ.వెయ్యి పెంచుతున్నట్లు ప్రకటించి వచ్చే నెల నుంచే రూ. 4016 ఇస్తామని చెప్పారు. సీఎం ప్రకటనతో వరంగల్ జిల్లాలో 16,127 మందికి.. హనుమకొండ జిల్లాలో 14,153 మందికి లబ్ధి చేకూరనుండగా, దివ్యాంగుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. కుల వృత్తి దారులకు రూ. లక్ష ఆర్థికసాయం అందిస్తున్నారు. గొల్లకుర్మలకు రెండో విడుత గొర్రెల పంపిణీ ప్రారంభించారు. దీంతో కుల వృత్తిదారులు, గొల్లకుర్మలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు జిల్లాల్లో ముఖ్యమంత్రి చిత్రపటాలకు శనివారం క్షీరాభిషేకాలు చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
వరంగల్(నమస్తేతెలంగాణ)/హనుమకొండ, జూన్ 10 : పింఛన్ పెంపుతో వరంగల్ జిల్లాలో 16,127 మందికి, హనుమకొండ జిల్లాలో 14,153 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది. వచ్చే నెల నుంచి రూ.4,016 పెన్షన్ అందజేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో దివ్యాంగులు మురిసిపోతున్నారు. ప్రస్తుతం నెలనెలా పొందుతున్న రూ.3,016కి తోడు అదనంగా మరో రూ.1,000 అందనుందని సంబుర పడుతున్నారు. కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులు సంబురాలు జరుపుకుని స్వీట్లు పంచారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
చెన్నారావుపేట మండలంలో 840 మందికి, దుగ్గొండిలో 1,147 మంది, గీసుగొండలో 676 మంది, జీడబ్ల్యూఎంసీలో 5,259 మంది, ఖానాపురంలో 719 మంది, నల్లబెల్లిలో 794మంది, నర్సంపేటలో 820 మంది, నర్సంపేటటౌన్లో 524 మంది, నెక్కొండలో 1,376 మంది, పర్వతగిరిలో 938 మంది, రాయపర్తిలో 1,075 మంది, సంగెంలో 955మంది, వర్ధన్నపేటలో 758 మంది, వర్ధన్నపేటటౌన్లో 246 మంది, మొత్తం జిల్లాలో 16,127 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది.
ఆత్మకూరు మండలంలో 722 మంది, భీమదేవరపల్లిలో 1081 మంది, దామెరలో 474 మంది, ధర్మసాగర్లో 824 మంది, ఎల్కతుర్తిలో 1196 మంది, హసన్‌పర్తిలో 441 మంది, ఐనవోలులో 836 మంది, కమలాపుర్‌లో 1725 మంది, నడికూడలో 743 మంది, పరకాల మున్సిపాలిటీలో 563మంది, పరకాలలో 431 మంది, శాయంపేటలో 780 మంది, వేలేరులో 464 మంది, గ్రేటర్ వరంగల్‌లో 3873 మంది దివ్యాంగులు ఉన్నారు.
వేలేరు : దివ్యాంగులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని వేలేరు సర్పంచ్ కాయిత మాధవరెడ్డి అన్నారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పింఛన్‌ను రూ.వెయ్యి పెంచుతూ సీఎం కేసీఆర్ ప్రకటించడంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం వేలేరు మండల కేంద్రంలో మండల కోఆర్డినేటర్ బిల్లా యాదగిరి, గ్రామ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యఅతిథిగా సర్పంచ్ కాయిత మాధవరెడ్డి హాజరై మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా దివ్యాంగులకు రూ.4,116 పింఛన్ ఇవ్వడం ఒక్క సీఎం కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. పింఛన్‌తో దివ్యాంగులకు ఒక భరోసా కల్పించారన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు జోగు ప్రసాద్, కొయ్యడ అశోక్, కిరణ్‌పాల్, సాంబరాజు, కేదారి పాల్గొన్నారు.
కమలాపూర్ : మండలంలోని మర్రిపెల్లిగూడెం గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్‌రెడ్డి చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు, వృద్ధులు, దివ్యాంగులు శనివారం పాలాభిషేకం చేశారు. దివ్యాంగులకు రూ.వెయ్యి పింఛన్ పెంపుతోపాటు కులవృత్తులకు రూ.లక్ష ఆర్థికంసాయం, గొల్ల, కురుమలకు రెండో విడుత గొర్రెల పంపిణీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఇనుగాల విజయ, పోరండ్ల రమేశ్, తిరుపతి పాల్గొన్నారు.
వరంగల్, జూన్ 10(నమస్తేతెలంగాణ) : రెండో విడుతలో జిల్లాలో 12,764 మందికి గొర్రెల యూనిట్లను అందజేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో 199 ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలను ఏర్పాటు చేశాం. ఇందులో 23,252 మంది సభ్యులు ఉన్నట్లు గుర్తించాం. వీరిలో 10,470 మందితో జాబితా-ఏ, 12,782 మందితో జాబితా-బి తయారు చేశాం. 2017-18లో తొలివిడుత 10,189 యూనిట్ల పంపిణీ జరిగింది. మిగతా వారికి రెండో విడుతలో పంపిణీ చేస్తాం. 18 మందికి గతంలోనే ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేసింది. జాబితా-బిలోని గొర్రెల పెంపకందారుల్లో 570 మంది తమ వాటాధనం చెల్లించారు. వీరిలో ఆరుగురికి శుక్రవారం గొర్రెల యూనిట్ల పంపిణీ జరిగింది. ప్రధానంగా రూ.1.75 లక్షల యూనిట్ కింద ఒక్కో లబ్ధిదారుడికి 21 గొర్రెలతో పాటు సీడ్, మందులను అందజేస్తాం. రవాణా ఖర్చులతో పాటు వాటి ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ఇందులో నుంచే చెల్లిస్తాం. ఏపీ, కర్నాటకలో కొన్న గొర్రెలను ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ల ద్వారా జిల్లాకు తీసుకొస్తాం. త్వరలోనే ఈ గొర్రెలకు మందులను కూడా ఇస్తాం.
– ఎం బాలకృష్ణ, పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి, వరంగల్