ఖిలావరంగల్, జనవరి 16 : ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్లో తప్పిపోయిన 12 సంవత్సరాల బాలుడిని రైల్వే పోలీసులు సురక్షితంగా గుర్తించి శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. వరంగల్ జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆపరేషన్ స్మైలీలో భాగంగా మధ్యాహ్నం పోలీసు కానిస్టేబుళ్లు కే ప్రశాంతి, ఫయాజుద్దీన్ వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లలో గస్తీ నిర్వహిస్తున్నారు. ప్లాట్‌ఫారమ్ నెంబర్ ఒకటిపై ఒక బాలుడు అనుమానాస్పదంగా అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు.
వెంటనే అతని అక్కున చేర్చుకుని వివరాలు తెలుసుకున్నారు. బాలుడు వినోద్ కుమార్ (12), తండ్రి శేఖర్, వరంగల్ జిల్లా నెక్కొండ వాసిగా గుర్తించారు. బాలుడు తన అక్క హాసిని, మేనమామ బిక్షపతితో కలిసి షాపింగ్ కోసం వరంగల్‌కు వచ్చి, గందరగోళంలో వారి నుంచి తప్పిపోయినట్లు పోలీసులకు తెలిపాడు. చైల్డ్ లైన్ కోఆర్డినేటర్, కల్పన ఆధ్వర్యంలో బాలుడి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.