హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): మావోయిజానికి ముగింపు లేదని డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయిన ఆ పార్టీ అగ్రనాయకులు ఆయన సమక్షంలోనే మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇకనుంచి ప్రజాక్షేత్రంలోనే తమ పోరాటం కొనసాగిస్తామని, ఇందుకు రాజకీయంగా అడుగులు వేయాలని నిర్ణయించామని వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్‌బ్యూరో మెంబర్ మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న లొంగిపోయారు. ఈ సందర్భంగా మావోయిస్టు పార్టీకి అనధికారిక జనరల్ సెక్రటరీగా కొనసాగిన దేవ్‌జీ మాట్లాడుతూ.. తాము లొంగిపోయేందుకు ఏర్పాట్లు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రికి, డీజీపీకి కృతజ్ఞతలు తెలియజేశారు. అనారోగ్య కారణాల రీత్యా.. ఉద్యమ జీవితాన్ని వదిలి.. బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ‘ఇది వ్యక్తిగత జీవితం కోసం తీసుకున్న నిర్ణయం కాదు. ప్రజల సమస్యలపై చట్టబద్ధ పద్ధతుల్లో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాను. నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాను. దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతాన్ని గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని అనుకుంటున్నాను’ అని ఆయన వెల్లడించారు.
మావోయిజానికి అంతం లేదు
అనంతరం కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్‌బ్యూరో మెంబర్ మల్లా రాజిరెడ్డి మాట్లాడుతూ.. తమ లొంగుబాటుకు సహకరించిన ముఖ్యమంత్రికి, డీజీపీకి కృతజ్ఞతలు తెలియజేశారు. వారి ప్లాన్, కృషితో ఇంతవరకూ వచ్చామని చెప్పారు. ‘రేపు ప్రజల సమస్యలపై, ప్రజల తరఫున, ప్రజలతో నిలబడి పని చేస్తామని చెప్తున్నాం. ప్రజాస్వామిక పద్ధతుల్లో అనుకున్నప్పుడు.. పార్లమెంటరీ సిస్టమ్‌లోకి పోవాలనుకోవడం మా ఉద్దేశం కాదు. ఇవాల్టికి ఆలోచించుకున్న నిర్ణయమే ఇది. ప్రజల, ప్రజాస్వామిక హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలను సంఘటితం చేయడం కోసం.. ప్రజాస్వామిక పద్ధతిలో, చట్టపరిధిలో మేము పనిచేయాలని ఆలోచించామ’ని వివరించారు. ‘మేము ఇంతకాలం ఏ రాజకీయాలు, సిద్ధాంతాలు చెప్తూ.. ప్రజలను సంఘటిత పర్చినమో.. ఆ అవగాహనను మా నుంచి తొలగించుకుంటాం. అయితే, అవకాశం ఉన్నంత మేరకు ప్రజల పోరాటం వెనుక నిలబడుతామని హామీ ఇస్తున్నాం. మావోయిజం ఎప్పుడూ ముగియదు.. ప్రపంచవ్యాప్తంగా అది ఎక్కడో ఓచోట పుట్టుకొస్తుంది. అభివృద్ధి చెందుతూనే ఉంటుంది’ అని మల్లా రాజిరెడ్డి పోలీసుల సమక్షంలోనే ప్రకటించారు.
లొంగిపోతే మా ప్రాణాలు అడ్డేస్తాం: డీజీపీ
మావోయిస్టు పార్టీ అగ్రనేతలు లొంగిపోయేందుకు ఎస్ఐబీ చీఫ్ సుమతి, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్‌కుమార్ బృందాలు విజయవంతంగా కృషి చేశాయని డీజీపీ శివధర్‌రెడ్డి కొనియాడారు. మావోయిస్టు పార్టీలో 2025-26లో నలుగురు సీసీఎంలు, 15 మంది ఎస్సీఎంలు, 25 మంది డీవీసీఎంలు, 63 మంది ఏసీఎంలు, 437 మంది కార్యకర్తలు మొత్తం కలిపి 544 మంది ఉన్నట్టు చెప్పారు. ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి అడవుల్లో లేరని, అర్బన్ ఏరియాల్లో ఉన్నట్టు తమకు సమాచారం ఉన్నదని వెల్లడించారు. గణపతి కూడా లొంగిపోతే మంచిదని సూచించారు. దేవ్‌జీ ప్రస్తుతం సెంట్రల్ కార్యదర్శి కాలేదని, సెంట్రల్ కమిటీ మీటింగ్ జరిగితే.. ఆయన జనరల్ సెక్రటరీ అయ్యేవారని డీజీపీ తెలిపారు. పోలీసు డిపార్ట్మెంట్ ప్రకారం చూస్తే.. మావోయిస్టు ఉద్యమం తెలంగాణలో లేదని ప్రకటించారు. సెంట్రల్ కమిటీలో ఉన్నవారు చాలామంది ఎదురుకాల్పుల్లో చనిపోగా.. మిగిలిన వారు లొంగిపోతున్నారని అన్నారు. తెలంగాణ నుంచి ముప్పిడి సాంబయ్య ఒక్కడే యాక్టివ్‌గా ఉన్నారని, మిగతా అందరూ కంప్యూటర్ ఆపరేటర్లు, చిన్నపాటి కార్యకర్తలేనని చెప్పారు. ఆయనతోపాటు ఉన్నవాళ్లు కూడా లొంగిపోతే మంచిదని సూచించారు. లొంగిపోయిన మావోయిస్టులను కాపాడుకునేందుకు అవసరమైతే వారి ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డు వేస్తామని డీజీపీ ప్రకటించారు.
తెలంగాణ నుంచి అజ్ఞాతంలో ఉన్నది 11 మందే
తెలంగాణలో పుట్టి.. నేటికీ అజ్ఞాత జీవితం గడుపుతున్నవారిలో కేవలం 11 మందే ఉన్నారని డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. వారిలో సీసీ మెంబర్ గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు, సీసీ మెంబర్ పసునూరి నరహరి జార్ఖండ్ క్యాడర్, స్టేట్ కమిటీ మెంబర్ ముప్పిడి సుదర్శన్ అలియాస్ సాంబయ్య తెలంగాణ క్యాడర్, డివిజన్ కమిటీ మెంబర్ వార్తా శేఖర్ ఇంజినీరింగ్ వ్యవహారాలు, జోడే రత్నాబాయి మాడ్ డివిజన్ ఇన్చార్జి, నక్క సుశీల దండకారణ్యం, భగత్‌సింగ్ కంప్యూటర్ ఆపరేటర్, రంగబోయిన భాగ్య, మద్వి సంగీత, కాశపోగు సుగుణ అలియాస్ భవాని, కుంజం ఇడామల్ ఉన్నారని డీజీపీ ప్రకటించారు. వీరు త్వరగా బయటికి రావాలని పిలుపునిచ్చారు. డీజీలు విజయ్‌కుమార్, మహేశ్ భగవత్, అనిల్‌కుమార్, ఐజీ సుమతి పాల్గొన్నారు.
కేంద్రం ఆపరేషన్ కగార్-2ను నిలిపివేయాలి ; వామపక్ష, రాజకీయ, ప్రజాసంఘాల నేతల విజ్ఞప్తి
కేంద్రప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ కగార్-2 నిలిపివేసి, మావోయిస్టులు గౌరవ ప్రదంగా జనజీవన స్రవంతిలో కలిసేందుకు చర్యలు చేపట్టాలని వామపక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు విజ్ఞప్తిచేశారు. సీపీఐ రాష్ట్రసమితి ఆధ్వర్యంలో మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్‌లో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. లొంగిపోయిన మావోయిస్టులకు గౌరవప్రదమైన పునరావాసాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. కోదండరామ్ మాట్లాడుతూ.. మావోయిస్టులను చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. పౌరహక్కుల సంఘం నాయకుడు నారాయణరావు మాట్లాడుతూ.. కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటికే వెయ్యి మందికిపైగా ఎన్కౌంటర్ చేసిందని మండిపడ్డారు. సమావేశంలో ఈటీ నరసింహ, వీఎస్ బోస్, రాజ్‌కుమార్, రమా, రమేశ్‌రాజా, స్టాలిన్, ఛాయాదేవి, గోవర్ధన్ , ఎస్ఎల్ పద్మ, చలపతి తదితరులు పాల్గొన్నారు.