హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో కురిసిన భారీ వర్షానికి మామిడి, వరి, మక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. సిద్దిపేట జిల్లా కేంద్రంతోపాటు దుబ్బాక పట్టణంలో భారీ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉపరితల ద్రోణితో రాష్ట్రవ్యాప్తంగా రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ తదితర జిల్లాల్లో వర్షం కురిసినట్టు పేర్కొన్నది. మరో మూడ్రోజులపాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా నల్లగొండ జిల్లా చందంపేటలో 6 సెం.మీ వర్షపాతం నమోదైందని తెలిపింది. నకిరేకల్‌లో 4.68, కేతేపల్లిలో 4.03, కట్టంగూర్‌లో 3.32, కొత్తగూడెంలో 4.64 వర్షపాతం నమోదైంది.