హైదరాబాద్, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ): పీఎం ఏక్తామాల్ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లు, డీపీఆర్, ఫైనాన్షియల్ మోడల్ వివరాలన్నింటినీ అందించాలని ట్రేడ్ కార్పొరేషన్ అధికారులను మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. ఈ మేరకు ఏక్తామాల్ ప్రాజెక్టులో భారీ కుంభకోణంపై స్వతంత్ర విచారణ జరిపించాలంటూ సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. కేటీఆర్ చేసిన ఆరోపణ లు ఖండిస్తున్నట్టు తెలిపారు. పీఎం ఏక్తామాల్ టెండర్లలో అవకతవకలు జరుగలేదని, నిబంధనల ప్రకారమే పారదర్శకంగా టెండర్లు జరిగాయని పేర్కొన్నారు.
ఇందులో భాగంగానే పీఎం ఏక్తామాల్ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు, ఫైనాన్షియల్ మోడల్, డీపీఆర్ సహా పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ అధికారుల ను ఆదేశించిన ట్టు తెలిపారు. ఇక అంతకు ముందు టెసెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి భూ కేటాయింపుల్లో అవకతకవలు జరుగలేదని, దీనిపై సమీక్షిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపా రు. కంపెనీకి భూకేటాయింపుపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడి కంపెనీకి తక్కువ ధరకే భూములు కేటాయించారంటూ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్టు తెలిపారు. టెసెరాక్ట్ కంపెనీకి, సీఎం సోదరుడికి ఎలాంటి సంబంధంలేదని పేర్కొన్నారు. కన్సల్టేటివ్ కమిటీ ఆన్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కమిటీ ఆమోదంతో పూర్తి పారదర్శకంగా టెసెరాక్ట్కు భూమి కేటాయించినట్టు చెప్పారు. ప్రతిపక్షాలు మా త్రం కంపెనీకి సీఎం సోదరుడు కొండల్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్నారని ఆరోపిస్తున్నా యి. ఇందుకు సంబంధించి కొండల్‌రెడ్డి లింక్డిన్ పేజీని చూపుతున్నాయి. ఆ పేజీలో ఆయన స్వయంగా తన కంపెనీ పేరు రాసుకోవడం గమనార్హం. ఈ కంపెనీకి రావిర్యాలలో 135 కోట్ల విలువైన భూమి ని కేవలం రూ.3,707కు కేటాయించారంటూ ఆరోపణలు చేస్తున్నాయి.