హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి షెల్ కంపెనీకి కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అడ్డగోలుగా కేటాయించారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రక్షణ, ఎయిరోస్పేస్ రంగాలకు సంబంధించిన వస్తువులను తయారు చేస్తామనే పేరుతో ‘టెసెరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్’ అనే కంపెనీకి టీజీఐఐసీ సంస్థ ద్వారా భూమిని కేటాయించారని అర్వింద్ ఆరోపించారు.
రక్షణ రంగానికి సంబంధించి ఉత్పత్తులు తయారు చేసే అసలైన కంపెనీల జాబితాలో ఈ టెసెరాక్ట్ కంపెనీ అసలు లేనే లేదని వివరించారు. మహేశ్వరం మండలంలోని రావిర్యాలలో అత్యంత విలువైన రూ.135 కోట్ల భూమిని కేవలం రూ.7.5 కోట్లకు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారానికి సీఎం బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.