పన్నగశాయి పరమాద్భుత రూపం అనంత పద్మనాభ స్వరూపం. సృష్టి, స్థితి,లయ తత్వాలకు ప్రతిబింబంగా కనిపించే పద్మనాభుడి దివ్యమంగళ రూపం ఎంత సేపుచూసినా తనివి తీరదు. కావేరి తీరంలో పద్మనాభుడిగా, తెలుగునాట రంగనాథుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు స్వామి. ఆయన సేవలో తరించే అవకాశం కల్పిస్తుంది ‘అనంత పద్మనాభ వ్రతం’. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే అద్భుతమైన వ్రతం ఇది. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి సాధనం. భాద్రపద శుద్ధ చతుర్దశి సందర్భంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆధ్యాత్మిక సాధనకు, లౌకిక విజయాలకు అనంత వ్రతం ఉత్తమ సాధనంగా చెబుతారు.
శ్రీమహావిష్ణువు.. అనంత పద్మనాభుని రూపంలో క్షీరసాగరంలో ఆదిశేషుడిపై శయనించి ఉంటాడు. వేయి పడగల ఆదిశేషుడు విష్ణువుకు ఒక పక్క శయ్యగా సేవలందిస్తూనే, మరో పక్క తన పడగలను విస్తరించి స్వామికి ఛత్రంలా ఆచ్ఛాదన కల్పిస్తూ ఉంటాడు. పద్మనాభుడి నాభికమలంలో సృష్టికర్త బ్రహ్మ సుఖాసీనుడవ్వడం ఈ స్వరూపంలోని మరో విశేషం. స్వామివారి పాదాల చెంత శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుంది.
పాంచజన్యమనే శంఖాన్ని, సుదర్శనమనే చక్రాన్ని, నందకమనే ఖడ్గాన్ని, కౌమోదకీ అనే గదను చతుర్భుజాలలో ధరించి ఉండే జగద్రక్షకుడు… దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు సిద్ధంగా కనిపిస్తాడు. నీలమేఘశ్యాముడైన లక్ష్మీనాథుడు పట్టుపీతాంబరధారియై, పద్మాల లాంటి నేత్రాలను కలిగి, వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నాన్ని, కౌస్తుభమణిని ధరించి సర్వాంగసుందరంగా శోభిల్లుతూ ఉంటాడని విష్ణుసహస్రనామ స్తోత్రం పూర్వపీఠికలో పేర్కొని ఉంది. శేషశయన భంగిమ వైష్ణవ సంప్రదాయంలో విశేషమైనదిగా చెబుతారు.
‘అనంత’, ‘పద్మనాభ’ అనే రెండు నామాల్లోనూ వైష్ణవ తత్వచింతనకు సంబంధించిన గాఢమైన భక్తిభావం ధ్వనిస్తుంది. సర్వత్రా వ్యాపించినవాడు కావడం చేత ‘అనంతుడు’గా; నాభియందు పద్మాన్ని కలిగి ఉండటం చేత ‘పద్మనాభుని’గా పిలుపు అందుకునే శ్రీహరి ‘అనంతపద్మనాభుని’గా అనుగ్రహిస్తుంటాడు. విష్ణు సహస్రనామ స్తోత్రంలోని తొలి శ్లోకం ‘విశ్వం విష్ణుర్వషట్కారో…’లో వర్ణించినట్లు, సృష్టిమొత్తాన్ని తనలో ఇముడ్చుకున్నవాడు, సృష్టిలోని అణువణువునా వ్యాపించివున్నవాడు అయిన విష్ణువుకు ‘అంతం’ ఉండటం అసంభవం కావడంతో, ఆయన అనంతుడుగా వాసికెక్కారు. ‘అనంతం’ అనే విశేషణం స్వామి రూపానికే కాక, గుణగణాలకు, స్వభావానికి కూడా వర్తిస్తుంది.

Padmanabha Swamy
అందుచేతనే వారి లీలావిశేషాలు తెలుసుకోవడంలో గంధర్వులు, కిన్నెరులు, చారణులు సైతం సఫలీకృతం కాలేదని విష్ణు పురాణం చెబుతుంది. మానవమాత్రులకు అదెలా సాధ్యమవుతుంది? ఇక, స్వామి నాభి నుండి ఉద్భవించే కమలం అనంతమైన విశ్వాన్ని సూచిస్తుంది. విశ్వవ్యాప్తంగా ఉన్న లోకాలు, పంచభూతాలు, చరాచర జీవ సముదాయం లాంటి ప్రకృతి విభూతులన్నీ ఆ పద్మం ‘పూరేకుల’ వలె ఒద్దికగా అమర్చి ఉంటాయి. వేటికవి స్వతంత్రంగా వ్యవహరించినట్టు మనకు గోచరించే ఈ శక్తులన్నీ వాస్తవానికి ఒకే కేంద్రం కలిగి, సర్వకాల సర్వావస్థలయందు దాని అధీనంలో ఉండటం చేతనే సృష్టి చక్రం గతి తప్పకుండా సజావుగా సాగుతుంది. తూర్పున ఉదయించడం, అస్తాద్రిలో అస్తమించడం సూర్యభగవానుడికి షరా మామూలే! ఆరు నూరైనా ఆ క్రమం ఇసుమంత కూడా మారదు. అటువంటి కేంద్రస్థానమే విష్ణువు ‘నాభి’.
అనంత పద్మనాభుడి స్వరూపాన్ని ఆరాధిస్తూ, సౌభాగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతుల కోసం భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహించే అనంత వ్రతానికి కూడా ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. పూజానంతరం, పద్నాలుగు లోకాలకు ప్రతీకగా భావించి, పద్నాలుగు ముడులు కలిగిన ‘అనంత సూత్రాన్ని’ ముంజేతికి ధరిస్తారు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు అనంత వ్రత మహిమను వివరించినట్లు పౌరాణిక కథనం. 108 దివ్యదేశాలలో ఒకటైన తిరుమలతో పాటు దేశంలోని పలు వైష్ణవ క్షేత్రాల్లో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. సాధారణంగా పద్నాలుగు సంవత్సరాలపాటు ఆచరించే ఈ వ్రతానికి సంబంధించిన ప్రస్తావన, భవిష్యోత్తర పురాణంలో ప్రముఖంగా కనిపిస్తుంది.
అనంతపద్మనాభుడి అనంతమైన వైభవానికి కేరళంలోని తిరువనంతపుర క్షేత్రం ప్రత్యక్ష తార్కాణంగా నిలుస్తుంది. శతాబ్దాల తరబడి ట్రావన్కోర్ సంస్థానం ఆదరణలో ఉన్న ఈ ఆలయపు నేలమాళిగల్లో నిక్షిప్తమై ఉన్న వెలకట్టలేని సంపద, లక్ష్మీవల్లభుడైన పద్మనాభుని అంతులేని ఐశ్వర్యానికి నిలువెత్తు నిదర్శనం. స్థలపురాణాన్ని అనుసరించి, విల్వమంగళం స్వామియార్ అనే పరమభక్తుడికి విష్ణువు బాలుడి రూపంలో దర్శనమిచ్చి, అనంతరం ఆరోజుల్లో అనంతంకాడుగా పిలిచే నేటి తిరువనంతపురంలో వెలిశారు. ప్రస్తుతం ఆలయంలోని అనంతశయన మూర్తి 12,008 సాలగ్రామ శిలలతో రూపొందినదిగా కేరళ ఆలయ సంప్రదాయం పేర్కొంటున్నది. నేపాల్లోని గండకి నది నుంచి సేకరించిన ఈ సాలగ్రామాలను కటు-శర్కరయోగంగా పిలిచే ప్రత్యేక మిశ్రమంతో అనుసంధానించినట్లు చెబుతారు. స్వామివారిని మూడు ద్వారాల ద్వారా- శిరస్సు, మధ్యభాగం, పాదాలు దర్శించుకునే విధానం ఈ ఆలయ విశిష్టతల్లో ఒకటి.
తెలుగు రాష్ర్టాల్లోనూ అనంతపద్మనాభుడి ఆలయాలు విరాజిల్లుతున్నాయి. అటువంటి ఆలయాల్లో, తెలంగాణలోని వికారాబాద్ అనంతగిరి కొండల్లో నెలకొని ఉన్న శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సమీపంలోని ఉండవల్లి గుహల్లో ఏడో శతాబ్దం నాటి ఏకశిల అనంతశయన విష్ణువు శిల్పం సహస్రాబ్దికి పూర్వమే తెలుగునాట ఈ రూపానికి ఉన్న విశేష ఆదరణను ప్రస్ఫుటం చేస్తుంది. అనంత చతుర్దశి నాడు దేశమంతా గణపతి నిమజ్జనాల సంరంభంలోతలమునకలై ఉన్న వేళ.. అదే తిథి అనంతపద్మనాభుడి స్మరణకు, అనంత వ్రత ఆచరణకు వేదిక కావడం యాదృచ్ఛికం కాదు; భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో పరస్పరం భిన్నమైన ఆరాధానారీతులైన శైవవైష్ణవ సంప్రదాయాల సమన్వయానికి, సామరస్యానికి తరతరాలుగా వస్తున్న ఒక అద్భుతమైన ప్రతీక. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అన్నారు కదా!!
– కృష్ణ బాలాజి పల్లపోతు, 99490 98406