నిరంతర ప్రకాశ వాహిని.. బ్రహ్మంగారి కాళికాంబ సప్తశతి జ్ఞానజ్యోతి
ఇలకు దిగెడు వేళ కులమెవరికిలేదు అంటూ పుట్టుకతోనే మనిషి సామాజిక స్థాయిని నిర్ణయించే కులవ్యవస్థను ప్రశ్నించిన బ్రహ్మంగారు, కులాధిక్యతపై మరింత గాఢమైన తాత్త్విక సవాలును విసురుతూ మాలమాదిగలను సాక్షాత్తు హరిహరులతో అనుసంధానించారు. సమాజం అట్టడుగు అంచులకు నెట్టివేతకు గురైన మనిషిలోనే దైవత్వాన్ని దర్శించడం-ఇది కేవలం కులనిరసన కాదు; మనిషి అస్తిత్వానికే దైవత్వపు ప్రతిష్టను కల్పించిన విశాల మానవతాతత్వం.
మాలమాదిగలకు మూలమ్ము హరియవును మాలమాదిగలకు శూలి మొదలు హరియు హరుడు రెండు తెరగులై వచ్చిరి కాళికాంబ! హంస! కాళికాంబ.
ఇలకు దిగెడు వేళ కులమెవరికిలేదు అంటూ పుట్టుకతోనే మనిషి సామాజిక స్థాయిని నిర్ణయించే కులవ్యవస్థను ప్రశ్నించిన బ్రహ్మంగారు, కులాధిక్యతపై మరింత గాఢమైన తాత్త్విక సవాలును
విసురుతూ మాలమాదిగలను సాక్షాత్తు హరిహరులతో అనుసంధానించారు. సమాజం అట్టడుగు అంచులకు నెట్టివేతకు గురైన మనిషిలోనే దైవత్వాన్ని దర్శించడం-ఇది కేవలం కులనిరసన కాదు; మనిషి అస్తిత్వానికే దైవత్వపు ప్రతిష్టను కల్పించిన విశాల మానవతాతత్వం.
సామాజికంగా వెలికి గురైన వర్గాల పట్ల సానుభూతి ప్రకటించడం ఒక స్థాయి అయితే, వారిలోనే పరమాత్మ స్వరూపాన్ని దర్శించడం మరో ఉన్నతమైన తాత్త్విక స్థాయి. బ్రహ్మంగారి దృష్టిలో మనిషి విలువకు జన్మ ప్రమాణం కాదు; మానవత్వమే ప్రమాణం. కులం మనిషిని విభజించగల సామాజిక నిర్మాణం కావచ్చు; కానీ ఆత్మకు కులం లేదనే అద్వైత భావన ఆయన తత్వంలో అంతర్లీనంగా ప్రవహిస్తుంది. మతం విషయానికి వచ్చినప్పుడు బ్రహ్మంగారి ఆలోచన మరింత నిర్భయంగా, మరింత విచక్షణాత్మకంగా, మరింత సమాజోపయోగకరంగా రూపుదాలుస్తుంది.
ఆయన ఇలా అంటారు..
మతము మత్తు గూర్చు మార్గమ్ము కారాదు హితము గూర్పవలయు నెల్లరకునుహితము గూర్పలేని మతము మానగవలే..
ఆనాటి ఛాందస ప్రపంచంలో ఈ మాటల విప్లవాత్మకతను అంచనా వేయాలంటే, ఆ కాలపు సామాజిక పరిస్థితుల నేపథ్యాన్ని మనసులో ఉంచుకోవాలి. మతం అంటే ప్రశ్నించరాని వ్యవస్థగా, ఆచారం అంటే అనుసరించవలసిన కర్తవ్యంగా భావించే వాతావరణంలో-మతం మనిషికి హితం చేకూర్చాలి; హితం చేకూర్చలేని మతాన్ని విడనాడాలి అని చెప్పడం సాధారణ ఉపదేశం కాదు. అది మతానికి ఒక సామాజికనైతిక ప్రమాణాన్ని నిర్దేశించిన తాత్త్విక ప్రకటన.
మతం మనిషిని భయంతో బంధించడానికి కాదు; వివేకంతో నడిపించడానికి. మానవులను విడదీయడానికి కాదు; పరస్పర హితచింతన వైపు నడిపించడానికి. ఆధ్యాత్మికతను బాహ్యాచారాల బంధనంలో కాకుండా, జీవన విలువల వెలుగులో చూడాలని బ్రహ్మంగారి తత్వం సూచిస్తుంది. ఆయన దృష్టిలో మతానికి అంతిమ ప్రమాణం మానవహితం. ఆ ప్రమాణం కోల్పోయినప్పుడు మతం తన అసలు ప్రయోజనాన్ని కోల్పోతుంది. ఇదే ఆయన తత్వంలోని విశిష్టమైన విచక్షణ.
సాటి మానవునకు సాయమ్ము పడబోక
నల్ల రాళ్లు తెచ్చి గుళ్ళు కట్టి
మొక్కులిడిన బ్రతుకు చక్క పడంబోదు
కాళికాంబ! హంస! కాళికాంబ
ఎంత సాహసోపేతమైన ప్రకటన! ఈ స్వరం వినిపించిన కాలాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూడాలి. అది పదిహేడవ శతాబ్దం. దక్షిణ భారతదేశం రాజకీయ పరివర్తనలతో, ప్రాంతీయ అధికార కుమ్ములాటలతో, సామాజిక అంతరాలతో, కులమత విభజనలతో, ఛాందస భావజాలంతో, ఆర్థిక అసమానతలతో సతమతమవుతున్న సంక్షుభిత కాలం. విజయనగర సామ్రాజ్య వైభవం క్షీణించిన అనంతరం ఏర్పడిన రాజకీయ అనిశ్చితి ప్రజాజీవితంపై తన ప్రభావాన్ని చూపుతున్న సమయం. అదే సమయంలో భక్తి ఉద్యమం మతాన్ని పండితుల ప్రాకారాల నుంచి సామాన్యుడి గడప దాకా తీసుకువస్తుండగా, తత్వకవిత్వం సమాజంలోని దురాచారాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నది!
కాలజ్ఞానం, తత్వగీతాలు, గోవింద వాక్యాలు తదితర రచనలతో విస్తరించిన బ్రహ్మంగారి సాహిత్య ప్రపంచంలో కాళికాంబ సప్తశతి ఒక విశిష్టమైన స్థానం పొందుతుంది. ఏడు వందల పద్యాలతో, కాళికాంబ హంస కాళికాంబ అనే మకుటంతో సాగిన ఈ పద్యరచనలో భక్తి ఉన్నది; కానీ ఆ భక్తి వెనుక విచక్షణ ఉన్నది. తత్వం ఉన్నది; కానీ ఆ తత్వం జీవితానికి దూరమైన నైరూప్య చింతన కాదు. ఇక్కడ భక్తి జీవితం నుంచి పారిపోయే మార్గం కాదు; జీవితాన్ని మరింత మానవీయంగా మలచే అంతరంగ శక్తి. ఆ తత్వం ప్రపంచానికి దూరంగా నిలిచే నైరూప్య భావన కాదు; మనిషి జీవనంలో ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం వెదికే ప్రజాజీవన చింతన. అందుకే కాళికాంబా సప్తశతి కేవలం ఆధ్యాత్మిక పద్యరచనగా పరిమితం కాదు. ఇందులో సామాజిక ప్రశ్న ఉన్నది; ఆర్థిక ప్రశ్న ఉన్నది; మానవ సంబంధాల ప్రశ్న ఉన్నది; వ్యక్తిసమాజ సంబంధాన్ని పునఃపరిశీలించే అంతరంగ తపన ఉన్నది!
కృషి యొనర్చు వాడె ఋషి
దారి నడుచునట్టి వారి కెల్లరకును హక్కులొకటె
కడుపులోన చిచ్చు కార్చిచ్చుపై హెచ్చు
పసిడి యందు హింస ప్రబలియుండు
ఈ పద్యంలో శ్రమైక జీవన సౌందర్యాన్ని చాటి చెప్పడమే కాదు, శ్రమకు ఆధ్యాత్మిక గౌరవాన్ని కూడా కల్పిస్తారు. కృషి చేసేవాడినే ఋషితో సమానంగా ప్రతిష్టించడం ద్వారా శ్రమను సామాజికంగా మాత్ర మే కాక, నైతికంగా, తాత్త్వికంగా కూడా ఉన్నత స్థానంలో నిలుపుతారు. కులవివక్షను ప్రశ్నించిన అదే మానవతా దృష్టి సహజంగానే మూఢాచారాలను, బాహ్య ఆడంబరాలను, ఆచారపరమైన అంధానుసరణను ప్రశ్నించే దిశగా విస్తరించింది. రాతి ప్రతిమలకు గుళ్లు, గోపురాలు కట్టి, అలంకారాలు చేసి, నైవేద్యాలు సమర్పించే సమాజాన్ని ఉద్దేశించి ఆయన వేసిన ప్రశ్న ఎంత సూటిదో చూడండి-వన్నెలైదు గల్గు ప్రతిమలకై గుళ్లు
గోపురాలు కూడు గుడ్డలిచ్చి
ప్రాణమున్న వారి పట్టించుకోరేమి
రాళ్లకు అలంకారాలు చేసి పూజించే మనిషి, ఆకలితో అలమటించే ప్రాణమున్న మనిషిని ఎందుకు పట్టించుకోడని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇది విగ్రహారాధనను మాత్రమే ప్రశ్నించే పద్యం కాదు. ఆరాధనకు మానవతే అంతిమ ప్రమాణమని ప్రకటించే సామాజిక తత్వం. ప్రాణమున్న మనిషిని నిర్లక్ష్యం చేసి, ప్రాణంలేని ప్రతిమకు వైభవోపచారాలు చేయడంలో భక్తి పరమార్థం ఏమిటని ఆయన సమాజాన్ని ఆత్మపరిశీలనకు ఆహ్వానిస్తున్నారు. దేవుడి కోసం చేసే ఆరాధన మనిషి పట్ల కరుణగా, సహాయంగా, హితచింతనగా పరిణమించకపోతే ఆ ఆరాధనలోని ఆత్మ ఏమిటన్న ప్రశ్నను ఆయన మన ముందుంచుతున్నారు.
అదే భావం మరింత అంతర్ముఖమైన
తాత్త్విక రూపంలో-
సర్వ దేవతలకు సదనమ్ము దేహమ్ము-
అనే పద్యంలో వ్యక్తమవుతుంది. దేవుడిని గుడి గోపురాల్లో మాత్రమే అన్వేషించకుండా, మానవదేహంలో, మానవహృదయంలో, జీవనచైతన్యంలో దైవత్వాన్ని దర్శించమనే సూచన ఇందులో అంతర్లీనంగా ఉన్నది. భక్తిని బాహ్యకర్మకాండం నుంచి అంతరంగ శుద్ధి వైపు మళ్లించే ప్రయత్నం ఇది. స్త్రీని గృహపరిధికి పరిమితం చేసిన కాలంలో ఆమెకు ఆయన కల్పించిన స్థానం ఎంత ముందుచూపుతో కూడుకున్నది? విద్యను అక్షరజ్ఞానానికి అతీతంగా జీవనవివేకంగా ఆయన ఎలా నిర్వచించారు? ఆ ప్రశ్నలకు సమాధానం మరికొన్ని పద్యాల్లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మానవతను కేంద్రంగా చేసుకున్న ఆ విశాల దృష్టి సహజంగానే స్త్రీల పట్ల ఆయన ఆలోచనలోనూ ప్రతిఫలించింది. స్త్రీని ప్రధానంగా గృహపరిధికి పరిమితం చేసిన నాటి సామాజిక పరిస్థితుల్లో ఆయన ఇలా అన్నారు.
తల్లి తండ్రి, గురుడు, దైవమ్ములందున
తల్లి పూజ ముఖ్యమెల్లరకును
సృష్టికంతటికీ స్త్రీ ప్రధానం కదా. తల్లి, తండ్రి, గురువు, దైవం-అన్నిటి మధ్య తల్లికి పూజ ముఖ్యమని చెప్పడమే కాక, సృష్టికంతటికీ స్త్రీ ప్రధానం అని ప్రకటించడం ఆయన కాలపరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే గమనించదగిన అభ్యుదయ భావన. స్త్రీని కేవలం కుటుంబ వ్యవస్థలోని ఒక పాత్రగా కాకుండా, సృష్టి పరంపరకు మూలశక్తిగా చూడటం ఇందులో కనిపిస్తుంది. ఇది స్త్రీని కేవలం ఆరాధనకు పాత్రమైన ప్రతిమగా నిలబెట్టడం కాదు; సృష్టి, కుటుంబం, సమాజం అనే మూడు స్థాయిల నిర్మాణంలో ఆమె ప్రాధాన్యాన్ని గుర్తించడం.
చదువగలరు లోని సారంబెరుంగరు
చదువు ఫలమదేమి, సారమేమి?
అంటూ చదువు ప్రయోజనాన్ని ప్రశ్నిస్తారు.
పుస్తకములు చదువ పూర్ణత్వమబ్బదు
హృదయ సంపుటములు చదువవలయు అని ప్రకటిస్తారు. పుస్తకాలు చదవడం మాత్రమే విద్య కాదు; చదివిన దాని సారాన్ని గ్రహించి, దానిని జీవనవివేకంగా మలచుకోవడమే సారవంతమైన విద్య అని ఆయన భావం. అక్షరజ్ఞానం మనిషికి సమాచారాన్ని అందించవచ్చు; కానీ ఆ సమాచారాన్ని విచక్షణగా, వివేకంగా, మానవతా దృష్టితో జీవితంలో అన్వయించుకున్నప్పుడే అది జ్ఞానంగా పరిణమిస్తుంది. అందుకే ఆయనకు జ్ఞానం పాండిత్య ప్రదర్శన కాదు-జీవన పరివర్తనకు సాధనం. మానవతను ఉపదేశించడమే కాదు మనిషిలో దైవత్వాన్ని చూశారు. స్త్రీని గౌరవించడమే కాదు ఆమెను సృష్టికి మూలంగా, ప్రధానంగా ప్రతిష్టించారు. విద్యను బోధించడమే కాదు, జ్ఞానసారాన్ని ప్రబోధించారు. అందుకే బ్రహ్మంగారి సాహిత్యాన్ని గతకాలపు తాత్త్విక అవశేషంగా చూడలేం.
అది వర్తమానాన్ని ప్రశ్నించే సజీవ చైతన్యధార. కాలాన్ని దాటి, తరాలను దాటి, సామాజిక పరిణామాల ఎన్నో మలుపులను దాటి, మానవ విలువల ప్రస్థానంలో తన ప్రాసంగికతను నిలుపుకుంటున్న ప్రజాస్వరం. వందల సంవత్సరాల కాలాన్ని ఛేదించి వర్తమానాన్ని మేల్కొలిపే ఆ చైతన్యస్వరం-కాళికాంబ సప్తశతిలో ప్రతిధ్వనించిన వీరబ్రహ్మంగారి నిరంతర, చిరంతన మానవతాసమానతా తత్వం! కాళికాంబ సప్తశతి నిన్నటి తత్వగ్రంథం మాత్రమే కాదు-నేటి మనిషి మనస్సాక్షిని మేల్కొలిపే సజీవ సామాజిక దర్పణం.
కాలాలను దాటి ప్రకాశించే
ఆ జ్ఞానజ్యోతి-కాళికాంబ సప్తశతి.
తరాలను దాటి పలికే ఆ మానవతా స్వరం-వీరబ్రహ్మంగారి తత్వం.
మనిషిని మేల్కొలిపే ఆ అంతరంగ దీప్తి
ఇప్పటికీ మనముందే వెలుగుతున్నది!!
కాపర్తి వీరేంద్ర
97044 11055
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

