హైదరాబాద్, ఆగస్టు10 (నమస్తే తెలంగాణ): ఫోర్త్‌సిటీ ముసుగులో సీఎం రేవంత్‌రెడ్డి భూదందాలకు తెరలేపారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. అది ఫోర్త్‌సిటీ కాదని, ఫోర్ బ్రదర్స్ సిటీ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం తన కార్యాలయాన్ని యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తూ అన్నదమ్ములు, అనుయాయులకు భూ కేటాయింపులు చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం లక్ష కూడా మూలధనం లేని సీఎం తమ్ముడు కొండల్‌రెడ్డికి చెందిన ట్రెజరాక్ట్ అడ్వాన్స్ సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రావిర్యాలలో అక్రమంగా ఐదెకరాలు కేటాయించారని విరుచుకుపడ్డారు. ఈ భూ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
అప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవాలని స్పష్టం చేశారు. మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలను ఉద్ధరించిందేమీ లేదని విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి తన అన్నదమ్ములను అడ్డం పెట్టుకొని నల్లధనాన్ని విదేశాలకు పంపి తెల్లగా మార్చుకొనేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో భూసేకరణ చేసి, పనులు ప్రారంభమైన వరంగల్ సూపర్‌స్పెషాలిటీ, నాలుగు టిమ్స్ దవాఖానలను పూర్తిచేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.
శ్రీకృష్ణానగర్, కిష్టారెడ్డిపేట్, పటాన్‌చెరులోని ఓ చిన్న ఇంట్లో సీఎం సోదరుడు కొండల్‌రెడ్డి ట్రెజరాక్ట్ అడ్వాన్స్ సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఏరోస్పేస్ డిఫెన్స్ ప్రొడక్షన్ షెల్ కంపెనీని ఏర్పాటు చేశారని ఆరోపించారు. రూ. లక్ష మూలధనం కలిగి ఒక్క ఉద్యోగి కూడా లేని, లైసెన్స్ కూడా దక్కని కంపెనీకి రావిర్యాలలో ఐదెకరాలు (20, 234 చదరపు మీటర్లు) చదరపు మీటర్‌కు రూ. 3707 చొప్పున కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
రేవంత్ పాలనలో తెలంగాణలో సాగుతున్న భూ దందాలపై కేంద్రంలోని బీజేపీ మౌనంగా ఉండటంలోని ఆంతర్యమేమిటని నిలదీశారు. ఇది రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. కొండల్‌రెడ్డి కంపెనీకి కట్టబెట్టిన ఐదెకరాలను వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు.