హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో జైలు సిబ్బందికి ఆర్థిక భద్రత కల్పించడం తమ బాధ్యత అని జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా అన్నారు. మంగళవారం నిర్వహించిన ప్రత్యేక ‘సాలరీ ప్యాకేజీ మేళా’లో వివిధ బ్యాంకుల ప్రతినిధులతో సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 1,332 మంది జైలు సిబ్బందికి పోలీస్ సాలరీ ప్యాకేజీ ప్రయోజనాలు వర్తింపజేస్తున్నట్టు తెలిపారు. వాటిలో ప్రమాద బీమా, జీవన బీమా, ఎయిర్ యాక్సిడెంట్ బీమా, జీతంపై ఓవర్డ్రాఫ్ట్, వ్యక్తిగత రుణాలు, పిల్లల వివాహం/విద్య రుణాలు తదితర సదుపాయాలు కల్పిస్తున్నట్టు వెల్లడించారు. సీఎస్ఆర్లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు ప్రతినిధులు వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న ఖైదీల సౌకర్యార్థం బ్యాటరీ వాహనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐజీ ప్రిజన్స్ ఎన్ మురళీబాబు, డీఐజీ (హైదరాబాద్ రేంజ్) డీ శ్రీనివాస్, డీఐజీ (వరంగల్ రేంజ్) ఎం సంపత్, సెంట్రల్ ప్రిజన్ హైదరాబాద్ సూపరింటెండెంట్ ఎన్ శివకుమార్ గౌడ్, సెంట్రల్ ప్రిజన్ చర్లపల్లి సూపరింటెండెంట్ జీ ప్రమోద్తోపాటు పలు బ్యాంకు నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.