వరంగల్ చౌరస్తా: శ్రీదేవి, భూదేవి, నీళాదేవి సహిత గోవిందరాజస్వామి ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ధ్వజస్థంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు వరయోగుల లక్ష్మణస్వామి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ మర్రిపల్లి సంజీవరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి మిట్టపల్లి భాస్కర్ పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించి, యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ధ్వజస్థంబాన్ని నిలిపారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సంజీవరావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో భాగంగా ధ్వజస్థంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దాతల సహకారంతో చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సీహెచ్ అనిల్ కుమార్, ఆలయ కమిటీ డైరెక్టర్లు, ఆలయ అనువంశీయ అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.