Salman Agha : క్రికెట్ మ్యాచ్‌లో ఆటగాళ్లు ఒక్కోసారి రనౌటవుతుంటారు. ఇద్దరి మధ్య సమన్వయం కొరవడి లేదంటే లేని పరుగుకు ప్రయత్నించి రనౌటవుతుంటారు కొందరు. కానీ, పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా (Salman Agha) మాత్రం ఊహించని విధంగా ఔటయ్యాడు. రెండో వన్డేలో అర్ధ శతకం బాదేసి పాక్‌కు భారీ స్కోర్ అందించాలనుకున్న అతడిని బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ విచిత్రంగా రనౌట్ చేశాడు. అతడలా తనను ఔట్ చేస్తాడని ఏమాత్రం ఊహించని అఘా కాసేపు షాక్‌లో ఉండిపోయాడు. ఇదేంటీ.. ఇలా రనౌట్ చేస్తారా అని బిత్తరపోయాడు.
అసలేం జరిగిందంటే.. బంగ్లాదేశ్, పాకిస్థాన్ రెండో వన్డేలో సల్మాన్ అఘా వివాదాస్పద రీతిలో రనౌటయ్యాడు. బంగ్లా సారథి మెహిదీ హసన్ మిరాజ్ వేసిన 39వ ఓవర్లో స్ట్రయికర్ రిజ్వాన్ బంతిని నేరుగా ఆడాడు. తనకు కుడిపవైపు వెళ్తున్న బంతిని మిరాజ్ కాలితో ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు నాన్ స్ట్రయికర్లో ఉన్న అఘాను ఢీకొట్టాడు. తనకాళ్ల దగ్గర ఆగిన బంతిని మిరాజ్‌కు ఇచ్చేందుకు పాక్ కెప్టెన్ కాస్త వంగాడు.
Not your everyday run out for sure #BANvPAK pic.twitter.com/2OffYG3WcI
— ESPNcricinfo (@ESPNcricinfo) March 13, 2026
అంతే.. గబుక్కున బంతిని తీసుకున్న బంగ్లాదేశ్ సారథి.. అఘా క్రీజు అవతల ఉండడం గమనించి స్టంప్స్‌ను గిరాటేశాడు. అసలు ఇలా రనౌట్ చేయడమేంటి? అని పాక్ కెప్టెన్ షాక్‌లో ఉండగా బంగ్లా ఆటగాళ్లు అప్పీల్ చేశారు. రీప్లేను పరిశీలించిన టీవీ అంపైర్ ఔటివ్వడంతో చేసేదేం లేక అఘా నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ఫలితంగా.. నాలుగో వికెట్‌కు రిజ్వాన్(44), అఘా(64)లు నెలకొల్పిన 109 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రిషద్ హొసేన్(3-56), మెహిదీ హసన్(2-34) విజృంభణతో పాక్ 47.3 ఓవర్లలో 274 పరుగులకే ఆలౌటైంది.