ఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు నిర్దోషిగా తేల్చింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్ సహా ఆరుగురు రెజ్లర్లు చేసిన ఫిర్యాదు మేరకు బ్రిజ్‌భూషణ్‌పై అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. అయితే సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం, తీవ్ర జాప్యం, బాధితులు ఇచ్చిన వాంగ్మూలాల్లో వ్యత్యాసాల కారణంగా ఈ కేసును కొట్టివేస్తున్నట్టు కోర్టు తెలిపింది. తీర్పు అనంతరం బ్రిజ్‌భూషణ్ స్పందిస్తూ.. ‘ఈ ఆరోపణలు అవాస్తవమని నేను మొదట్నుంచీ చెబుతూనే ఉన్నా.
ఒకవేళ అవి నిజమని తేలితే ఉరివేసుకుంటాననీ చెప్పా. ఈరోజు నేను చెప్పిందే నిజమైంది’ అని చెప్పాడు. ఇదిలాఉండగా కోర్టు తీర్పు తీవ్ర నిరాశ కల్గించిందని వినేశ్ పేర్కొంది. ఆమె ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ఈ కేసులో మొదట్నుంచి ప్రభుత్వం, పరిపాలనా వ్యవస్థ మొత్తం బ్రిజ్‌భూషణ్‌ను కాపాడుతున్నాయి. కోర్టు తీర్పు తీవ్ర నిరాశను కల్గించింది. అధికార పార్టీకి చెందిన నాయకుడిపై ఫిర్యాదు చేయడానికి, వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలపడానికి మేం ఎంతో ధైర్యం కూడగట్టుకోవాల్సి వచ్చింది. ఆయన తన పలుకుబడిని ఉపయోగించి పలువురు అమ్మాయిలు కేసును వాపసు తీసుకునేట్టు ఒత్తిడి తెచ్చారు. ఇప్పటికీ ఈ కేసులో మేం నమ్మకాన్ని కోల్పోలేదు. ఈ తీర్పుపై అప్పీల్ చేస్తాం. మా పోరాటాన్ని కొనసాగిస్తాం’ అని పేర్కొంది.