నర్సంపేట, ఆగస్టు 3 : ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని, నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల, దేవాదుల ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలనే డిమాండ్లు గ్రామగ్రామాన వినిపిస్తున్నాయి. నర్సంపేట నియోజకవర్గం లోని ఊరూరా పెద్ది చిత్రపటాలకు పాలాభిషేకాలు, నివాళులర్పిస్తున్నారు. ఆయన కుటుంబానికి పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెకొండలో సుదర్శన్‌రెడ్డి విగ్రహ ప్రతిష్టాపనకు ప్రత్యేక అను మతివ్వాలని కోరుతూ సోమవారం బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు సంగని సూరయ్య, మార్ఫెడ్ మాజీ డైరెక్టర్ సూరం రాజిరెడ్డి, జిల్లా కో-ఆప్షన్ మాజీ సభ్యుడు అబ్దుల్ నబీ, సోషల్ మీడియా కన్వీనర్ మాతంగి రాజు, సిరిపోతుల సురేశ్, వడ్డే మహేష్‌ల ఆధ్వర్యంలో పలువురు నాయకులు కలెక్టర్ సత్యశారదకు వినతి పత్రాన్ని అందజేశారు. నెకొండ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్, బీఆర్ఎస్ శ్రేణులు తాటిపల్లి శివకుమార్, కారింగుల సురేశ్‌గౌడ్, దాసరి శ్రీనివాస్, దేవనబోయిన వీరభద్రం, ఈదునూరి వెంకన్న కూడా విజ్ఞప్తి చేశారు.
నర్సంపేటలోని అమరవీ రుల స్తూపం వద్ద పెద్ది చిత్రపటానికి చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన డప్పు కళా బృందం సభ్యులు పెరుక బాబు, జన్ను రమేష్, పెరుక అశోక్, పెరుక వంశీ, పెరుక అనిల్, కన్నం సత్య, అక్కెల్లి చోటు, దామెర ప్రభు, గణేష్, శ్రీను, సదయ్య, ప్రకాష్ పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. అదేవిధంగా ముత్యాలమ్మ తండాలో మాజీ ఎమ్మెల్యే పెద్ది మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు వీరన్న, రవి, తిరుపతి, రమేష్, రాజు, ఈర్య కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. సుదర్శన్‌రెడ్డి ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక సభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాడుగుల రవీందర్ శర్మ, డాక్టర్ యజ్ఞం పవన్‌కుమార్ శర్మ, వింజమూరు సుధాకర్, పోచంపల్లి రమణారావు, ఆవునూరి రమ ణారావు, చకిలం నర్సింహారావు, ఓలేటి లక్ష్మణాచార్యులు, రామకృష్ణాచార్యులు, బాబా శర్మ, కృష్ణప్రసాద్ ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణవార్తను, అంతిమ యాత్రను టీవీల్లో చూసి కలత చెందిన ఆయన అభిమానులు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ నాయకులు, అభిమానులు నల్లబెల్లిలోని నివాసానికి చేరుకొని ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. పెద్ది కుటుంబాన్ని డీసీసీబీ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర నాయకుడు బీరెల్లి భరత్కుమార్రెడ్డితోపాటు పలువురు నాయకులు పరామర్శించారు. పెద్ది చిత్రపటానికి ప్రొఫెసర్ వెంకటనారాయణ, సాంబరాతి మల్లేశం, డివిజన్ పాస్టర్లు నివాళులర్పించారు. అదేవిధంగా మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, బీజేపీ రాష్ట్ర నాయకుడు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, ఎన్ఎస్ఆర్ గ్రూప్స్ చైర్మన్ సంపత్‌రావు, పుల్లారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణాప్రతాప్రెడ్డితో కలిసి పెద్ది చిత్రపటానికి నివాళులర్పించారు. అదేవిధంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.