ములుగు : సరదాగా తండ్రితో పాటు పొలానికి వెళ్లిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ( Sisters Die ) ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. ములుగు ( Mulugu ) మండలం కాసిందేపేట గ్రామానికి చెందిన సీపీఐ నాయకుడు మహమ్మద్ అంజద్ పాషా తన కుటుంబ సభ్యులతో కలిసి పత్తి చేనులో పురుగుల మందు కొట్టేందుకు తండ్రితో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు సమ్యాన్ (19), ఆసియా (10) కూడా పొలం వద్దకు వెళ్లారు.
తండ్రి పొలంలో పనిచేసుకుంటుండగా, సాయంత్రం నాలుగు గంటల సమయంలో పిల్లలిద్దరూ సరదాగా సమీపంలో పంట సాగు నీటి నిల్వ కోసం తవ్విన గుంట (ఫాం పాండ్) వద్దకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత పిల్లలు ఎక్కడా కనిపించకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు పొలం చుట్టుపక్కల వెతికారు.
సందేహం వచ్చి నీటిగుంట వద్దకు వెళ్లి పరిశీలించగా, పిల్లలిద్దరూ నీటిలో మునిగిపోయి నట్లు గుర్తించారు. వెంటనే వారిని బయటకు తీసి కాపాడుకునేందుకు ప్రయత్నించి నప్పటికీ, లోతు ఎక్కువ కావడంతో అప్పటికే ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు.