వాజేడు/మహదేవపూర్, ఏప్రిల్ 4 : అడవి బిడ్డలకు ఉపాధినిచ్చే ఇప్ప పూల సీజన్ మొదలైంది. దీని కోసమే ఎదురుచూస్తున్న గిరిజన, గిరిజనేతర కుటుంబాలు అడవిబాట పడుతున్నాయి. వేకువ జామునే సమీప అటవీ క్షేత్రంలోకి వెళ్లి చెట్టు నుంచి రాలిన ఇప్పపూలను బుట్టల్లో సేకరిస్తున్నాయి. ప్రత్యేక పద్ధతిలో వారం రోజుల పాటు ఎండబెట్టిన తర్వాత గిరిజన సహకార సంస్థ(జీసీసీ)లో విక్రయిస్తాయి. అటవీ ఉత్పత్తుల్లో అక్టోబర్-ఫిబ్రవరి మాసంలో చిల్ల గింజలు, తాండి కాయలు, విషముష్టి కాయలు, సెప్టెంబర్-జూన్ తవుసు బంక, మార్చి-మే ఇప్ప పువ్వు, జూన్-జూలైలో ఇప్పపరక సేకరణతో గిరిజనులకు ఉపాధి లభిస్తుంది.
వరి, మక్కజొన్న, మిర్చి పంటల్లాగే వేసవికాలంలో ఇప్ప చెట్లు మార్చి, ఏప్రిల్ నెలల్లో పూత, కాతలతో నిండి ఉంటాయి. దీనినే ఇప్ప సీజన్‌గా పిలుస్తారు. ఇది అడవి బిడ్డలకు రెండో పంటగా చెప్పవచ్చు. సహజ సిద్ధంగా దొరికే ఇప్ప పూలు పలు విధాలుగా ఉపయోగపడతాయి. ఈ సమయంలలో గిరిజనులు, గిరిజనేతరులు పూల సేకరణలోనే నిమగ్నమవుతారు. ఉదయం 10 గంటల వరకు పూలు ఏరి, తిరిగి గూడేలు, గ్రామాలకు చేరుకొని ఎండబెడతారు.
వర్షాకాలంలో ఇప్ప పూలను చిక్కుడు గింజలు, అలసందలతో కలిపి ఉడికించి అంబలి కాస్తారు. ఇప్ప పువ్వు అన్నం వండుతారు. మరికొందరు ఉండలుగా చేసి అల్పాహారంగా స్వీకరిస్తారు. అలాగే వీటిని మందుల తయారీలోనూ వాడతారు. ఈ పూల నుంచి తీసిన తైలాన్ని పక్షవాతం తదితర వ్యాధులకు ఉపయోగిస్తారు. ఇప్ప బద్ధ లతో సబ్బులు, ఎరువులు తయారు చేయడంతో పాటు వీటి నుంచి తీసిన నూనెను వంటలతో పాటు దీపారాధనకు వినియోగిస్తారు. మరికొందరు ఇప్ప సారా తయారు చేసుకొని సేవిస్తుంటారు.
అటవీ ఉత్పత్తులకు సరైన గిట్టు బాటు ధర రాకపోవడంతో ప్రస్తుతం వీటి సేకరణపై గిరిజనుల ఆసక్తి యేటా తగ్గుతూ వస్తున్నది. ప్రస్తుతం ఇప్పపువ్వును జీసీసీ ద్వారా కిలో రూ.30కు కొనుగోలు చేస్తున్నారు. అయితే బయట మార్కెట్లో కిలోకు రూ.50 చెల్లిస్తున్నారని, తమకు గిట్టుబాటు ధర పెంచాలని గిరిజనులు జీసీసీని అభ్యర్థిస్తున్నారు. ఈ విషయమై వెంకటాపురం(నూగూరు), మహదేవపూర్ జీసీసీ మేనేజర్లు దేవ్, హరిలా ల్ మాట్లాడుతూ అటవీ ఉత్పత్తులపై గిరిజనులు అవగాహన కల్పిస్తున్నామని, ఈ ఏడాది కూడా ఇప్ప పువ్వు సేకరణకు టార్గెట్ నిర్దేశించినట్లు తెలిపారు. గిట్టుబాటు ధర కోసం ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.