స్మార్ట్‌సిటీ పథకంలో భాగంగా గ్రేటర్ వరంగల్‌లో చేట్టిన అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. గత డిసెంబర్‌తో గడువు ముగియగా, కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలల సమయం ఇచ్చింది. ఆ గడువు కాస్త ఈ నెలాఖరుతో ముగియనుండగా, పనులు మాత్రం ముందు కు సాగడం లేదు. ఈ పనులను దక్కించుకున్న ఇన్చార్జి మంత్రి కంపెనీ మధ్యలోనే చేతులెత్తేయగా, సబ్ కాంట్రాక్టర్ పొందిన సియాన్ సంస్థ అప్పుడప్పుడు పనులు చేయిస్తున్నది.
– హనుమకొండ, మార్చి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో మౌలిక వసతుల కల్పన అధ్వానంగా ఉన్నది. చారిత్రక నగరంలో అభివృద్ధి పనుల తీరు పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లుగా మారింది. స్మార్ట్‌సిటీ పథకంలో మంజూరైన రోడ్ల నిర్మాణం ఎంతకీ పూర్తి కావడంలేదు. టెండర్ ప్రక్రియలో ఇన్చార్జి మంత్రి సొంత కంపెనీకి స్మార్ట్ సిటీ రోడ్ల పనులు దక్కించుకోవడం వరంగల్ నగరానికి శాపంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వానకాలం మొదలయ్యేలోపు రోడ్ల పనులు పూర్తవుతాయా? లేదా అనేది సందేహంగా మారింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వైఫల్యంతో స్మార్ట్ సిటీ పథకం వరంగల్ నగరానికి పూర్తి స్థాయిలో వినియోగించుకోకుండా పోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పథకంపై మొదట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు గడువు ముగిసే సమయానికి హడావుడిగా చేశారు. ప్రణాళిక లేమి కారణంగా పనులు పూర్తి కావడంలేదు. గ్రేటర్ వరంగల్‌లో రూ.20కోట్లతో చేపట్టిన 11 అభివృద్ధి పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. డిసెంబర్ 31తో స్మార్ట్‌సిటీ పథకం ముగిసింది. ప్రత్యేక విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం మూడు నెలల గడువు ఇచ్చింది. నెలాఖరుతో పనులు పూర్తి చేయాల్సి ఉండగా, క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడంలేదు.
నాలుగు స్మార్ట్‌రోడ్ల టెండర్ దక్కించుకున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ రోడ్ల నిర్మాణాలపై మధ్యలోనే చేతులేత్తేసింది. సబ్ కాంట్రాక్టర్ పొందిన సియాన్ సంస్థ అప్పుడప్పుడు పనులు చేస్తున్నది. నిర్మాణ పనులు పొందిన ఏజెన్సీల నిర్లక్ష్యంతో గ్రేటర్ వరంగల్‌లో స్మార్‌సిటీ పథకం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు ఎంతకీ పూర్తి కావడంలేదు. దీంతో స్మార్ట్ సిటీ బోర్డు ఆమోదించిన వాటిలో మౌలిక వసతుల కల్పన పనులను తొలగించారు. అయినా, పనులు సకాలంలో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

మధ్యలో చేతులెత్తేసిన ‘రాఘవ కన్స్ట్రకన్స్’
హనుమకొండ చౌరస్తా నుంచి పద్మాక్షి దేవాలయం మీదుగా హంటర్‌రోడ్డు వరకు 2.04 కిలోమీటర్ల స్మార్ట్‌రోడ్డు పనులు ఎంతకీ పూర్తి కావడంలేదు. రాఘవ కన్స్ట్రకన్స్ సంస్థ ఈ పనులను దక్కించుకున్నది. పనులు మధ్యలో వదిలేసి తప్పుకున్నది. సబ్ కాంట్రాక్టు పొందిన సియాన్ సంస్థ ఇప్పటి వరకు పనులు పూర్తి కావడంలేదు. సబ్ కాంట్రాక్టరు సంస్థ నుంచి అధికార పార్టీలోని మాజీ కార్పొరేటర్ ఈ పనులు చేస్తున్నాడు. కమీషన్ల కోసం నాసిరకంగా పనులు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
రోడ్డు నిర్మాణంలో ముందుగా బ్రిడ్జిలు, కల్వర్టులు పూర్తి చేస్తారు. పద్మాక్షి రోడ్డులో దీనికి విరుద్ధంగా పనులు జరుగుతున్నాయి. వానకాలంలోపు కల్వర్టు, బ్రిడ్జిలు నిర్మించకుంటే మరో ఏడాది వరకు ఈ రోడ్డు అందుబాటులోకి రాదు. శివ ముక్తిథామ్ వరకు డివైడర్లు నిర్మించారు. మిగతా సగం సింగిల్ డివైడర్ నిర్మించి లైటింగ్ ఏర్పాటు చేసేలా పనులు కుదించారు. కాంట్రాక్టర్ తన సౌలభ్యం కోసం పద్మాక్షీ రోడ్డులో ఫుట్‌పాత్‌ల నిర్మాణాన్ని తొలగించారు. రోడ్డు పూర్తయినా నడచుకుంటూ వెళ్లాలనుకునే వారికి ఇబ్బందులు తప్పవు.
స్మార్ట్‌సిటీ పథకంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భద్రకాళీ బండ్ పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. పోతన బైపాస్ రోడ్డులోని డ్రైనేజీ విస్తరణ, నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలాయి. వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు, సివిల్ పనులు అలాగే ఉన్నాయి. ఉర్సు రంగసముద్రంలో చేపట్టిన గణేష్ విగ్రహాల నిమజ్జన గుండం నాసిరకం పనులతో కుంగిపోయింది. కాంట్రాక్టర్ తూతూమంత్రంగా మెరుగులు దిద్దడంతో మళ్లీ అదే పరిస్థితి నెలకొన్నది. అండర్‌రైల్వేగేట్ ప్రాంతంలోని గవిచర్ల క్రాస్ రోడ్డు నుంచి కరీమాబాద్ మీదుగా సాకరాశికుంట వరకు స్మార్ట్‌రోడ్డు అసంపూర్తి పనులతో అధ్వానంగా మారింది. రోడ్డుకు ఇరువైపు నిర్మించే ఫుట్‌పాత్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి.