వరంగల్, జూన్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక మలుపుగా భావించే మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ ప్రక్రియ ఎంతకీ ముందుకు సాగడం లేదు. ఎయిర్‌పోర్టు అభివృద్ధికి అవసరమైన భూసేకరణ ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎడతెగని జాప్యం చేస్తున్నది. వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా మంత్రి కొండా సురేఖ ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించినా ఎయిర్‌పోర్టు అభివృద్ధిలో ఎలాంటి మార్పు ఉండడం లేదు. మౌఖిక ఆదేశాలతో సమీక్షలు ముగిసిపోతున్నాయి. వరంగల్ జిల్లాలోని అధికార యంత్రాంగం తీరు ఇలాగే ఉంటున్నది. సమీక్ష తర్వాత రెండు మూడు రోజులు హడావుడి చేసి ఆ తర్వాత పక్కన పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం తీరుతో మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణపై అయోమయం నెలకొన్నది. ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ కోసం వరంగల్ జిల్లా యంత్రాంగం సర్వే చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. భూములు కోల్పోతున్న వారికి నష్టపరిహారం నిర్ణయించడంలో జాప్యం జరుగుతున్నది.
మూడు సార్లు రైతులతో సమావేశాలు నిర్వహించినా పరిహారం ధరపై స్పష్టమైన నిర్ణయానికి రావడం లేదు. ఇటీవల జరిగిన సమావేశంలో వ్యవసాయ భూమికి ఎకరాకు రూ.1.20కోట్లు, లే అవుట్ ప్లాట్‌కు చదరపు గజానికి రూ. 4,887 చొప్పున అధికారులు ప్రతిపాదించారు. భూములు కోల్పోతున్న రైతులు ఈ ధరను అంగీకరించలేదు. మరోసారి సమావేశమవుదామని చెప్పి అధికారులు వాయిదా వేశారు. భూసేకరణపై నాలుగు నెలలుగా ఇదే వైఖరి కొనసాగుతున్నది. మామునూరు ఎయిర్‌పోర్టుకు ఇప్పటికే 696 ఎకరాల భూమి ఉండగా, మరో 253 ఎకరాలు అవసరం ఉన్నది. దీంట్లో 220 ఎకరాల వ్యవసాయ భూమి, 33 ఎకరాల ప్లాట్లు ఉన్నాయి.
నక్కలపల్లిలో 47 ఎకరాలు, గాడిపల్లిలో 197 ఎకరాలకు సంబంధించి సర్వే చేసిన అధికారులు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి మూడు నెలలవుతున్నది. రైతులకు న్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం తీవ్ర జాప్యం చేస్తుండడంతో భూ సేకరణకు అడ్డంకులు పెరుగుతున్నాయి. ఎయిర్‌పోర్టు పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటి నుంచి ముందుగానే భూములు కొనుగోలు చేసిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడి భూముల ధరలు పెంచుతున్నారు. అధికారులు తమ ప్రతిపాదనలు ప్రకటించే సమయానికి భూ యజమానులు అంతకుముందు సమావేశంలో కంటే ధరలను పెంచి చెబుతుండడంతో భూ సేకరణలో స్తబ్ధత ఏర్పడుతున్నది.
హైదరాబాద్ రాష్ర్టాన్ని పాలించిన నిజాం సర్కారు హయాంలో వరంగల్ సుబేదార్ (ప్రాంతీయ కేంద్రం)గా ఉండేది. వరంగల్‌లో అప్పుడు అజంజాహి టెక్స్టైల్ మిల్లును ఏర్పాటు చేశారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో మామునూరు ఎయిర్ పోర్టును నిర్మించడంతో హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వాయుదూత్ పేరుతో 1930 నుంచి విమానాలు నడిచేవి. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో 1981లో సర్వీసులు నిలిచిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మామునూరు ఎయిర్‌పోర్టు సేవల పునరుద్ధరణకు అడుగులు పడ్డాయి. ఇందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ ప్రణాళికను 2020లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించింది.
ఈ ప్రతిపాదనలతో 2022లో కేంద్ర ప్రభుత్వం మామునూరు ఎయిర్ పోర్టును ఉడాన్ పథకంలో చేర్చింది. మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం 2023లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త బృందం ఏర్పాటు కాగా, రూ. 592 కోట్లతో పునరుద్ధరించాలని పేర్కొన్నది. ఇందుకు అవసరమైన నిర్ణయాలు, నిధులు, భూసేకరణపై కార్యాచరణను ప్రతిపాదించింది. విమాన సర్వీసుల పునరుద్ధరణ కోసం మామునూరు ఎయిర్‌పోర్టులో 2.9 కిలోమీటర్ల పొడవుతో రన్‌వే, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నేవిగేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టలేషన్ నిర్మించాలని సూచించింది. ఇందుకోసం అప్పటికే ఉన్న 696 ఎకరాల భూమికి అదనంగా మరో 253 ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్ 17న రూ. 205 కోట్లు విడుదల చేసింది.
వరంగల్ నగర సమీపంలోని మామూనూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధి, విమాన సర్వీసుల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా ఆ దిశగా కార్యాచరణ అమలు కావడంలేదు. శంషాబాద్ ఎయిర్‌పోర్టును నిర్మించే ముందు కేంద్ర ప్రభుత్వంతో, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం చేసుకున్నది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో అప్పటికే ఉన్న విమానాశ్రయాలు, కొత్త వాటి అభివృద్ధికి అనుమతించొద్దని ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 150 కిలో మీటర్ల పరిధిలో మరో ఎయిర్‌పోర్టు సర్వీసులు ఉండకూడదనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో రద్దు చేసింది. మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ పనుల్లో అప్పటి నుంచి ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.