వరంగల్, మార్చి 1(నమస్తేతెలంగాణ) : గ్యాస్ ధరల పెంపుపై జనం భగ్గుమంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి ధరలను పెంచడంపై మండిపడుతున్నారు. తాజాగా రూ.50 అదనపు భారం మోపడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. ధరల పెంపును నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 2,28,865 వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.
వీటిలో సింగిల్ సిలిండర్వి 1,05,211. డబుల్ సిలిండర్వి 23,091. దీపం పథకం నుంచి పంపిణీ చేసినవి 59,370. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింది ఇచ్చినవి 19.466. ఉజ్వల పథకం ద్వారా అందజేసినవి 21,727. గ్యాస్ వినియోగదారులు సగటున నెలకు ఎనభై వేల సిలిండర్ల(ఒక్కో సిలిండర్ 14.2కిలోలు)ను వాడుతున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచిన ప్రతిసారి వినియోగదారులపై అదనపు భారం పడుతున్నది. గ్యాస్ వినియోగం తమకు గుదిబండగా మారిందని సకల జనులు ఆక్రోశిస్తున్నారు. ఏడాది కాలంగా పెరిగిన వంట గ్యాస్ ధరలను పరిశీలిస్తే… 2022 మార్చిలో రూ.971 ఉన్న 14.2కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.1,021కి పెంచింది.
మే 7న రూ.1,071కి పెంచేసింది. కొద్దిరోజుల అనంతరం రూ.1,124కి పెంచింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి రూ.1,174గా నిర్ణయించింది. ఇలా ఏడాది తిరగకముందే నాలుగుమార్లు పెంచి జనం నడ్డి విరిచింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్(19కిలోల) ధర రూ.2,014 నుంచి రూ.2,365.50కి ఎగబాకింది. ఒక వాణిజ్య సిలిండర్‌పై అదనంగా రూ.351.50 పెరిగింది. తాజా పెంపుతో వినియోగదారులపై నెలకు రూ.40 లక్షల ఆర్థికభారం పడనుంది.
ధర పైపైకి పోతుండడంతో వంట గ్యాస్‌ను వినియోగించడానికి జనం వణికిపోతున్నారు. గ్యాస్‌తో వంట చేస్తే బతుకలేమని కుమిలిపోతున్నారు. గ్యాస్ సిలిండర్లు, స్టౌలను అటకెక్కిస్తున్నారు. మళ్లీ పొయ్యి అంటిస్తున్నారు. కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. ఉజ్వల పథకం ద్వారా డిపాజిట్ లేకుండా వంట గ్యాస్ కనెక్షన్లు పొందిన లబ్ధిదారులు సైతం సిలిండర్, స్టౌను తొలగిస్తున్నారు. డిపాజిట్ లేదంటే ఉజ్వల పథకం నుంచి గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే తీరా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచుతూ తమపై మోయలేని భారం మోపుతోందని వాపోతున్నారు. అధికారంలోకి వచ్చాక గ్యాస్ ధర తగ్గిస్తామని చెప్పిన బీజేపీ పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నదని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. బుధవారం గ్యాస్ వినియోగదారులు జిల్లాలో కేంద్రంలో బీజేపీ, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. గ్యాస్ ధర పెంపుపై నిరసన తెలపడానికి సిద్ధమవుతున్నారు.
– హసీనా, ఐకేపీ సీఏ, రాయపర్తి
రాయపర్తి, మార్చి 1 : కరోనాతో ఇప్పటికే సాధారణ, మధ్య తరగతి ప్రజల ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచుతుండడంతో ప్రజల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. మళ్లీ కట్టెల పొయ్యి వాడే పరిస్థితులు దాపురించాయి. పెరిగిన గ్యాస్ ధరలతో చిరు ఉద్యోగులు బతుకు వెళ్లదీయడం కష్టంగా మారింది.
-రాయిల పావని, చిరు వ్యాపారి, కాశీబుగ్గ
కాశీబుగ్గ : గ్యాస్ ధరల పెంపుతో పేదలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్వంలాగే ఇంటింటికీ కట్టెల పొయ్యి ఉపయోగించాల్సి వస్తోంది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుండగా, గ్యాస్ ధరల మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు అయింది. ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
– శ్రీరామోజు లచ్చవ్వ, చెన్నారావుపేట
చెన్నారావుపేట, మార్చి 1 : ఉజ్వల గ్యాస్ ఉత్తదే అయింది. ఒక్కసారి ఫ్రీగా గ్యాస్ మొద్దు, పొయ్యి ఇచ్చిన్రు. గతంలో రూ.400కు వచ్చే గ్యాస్.. ఇప్పుడు రూ.1100 దాటింది. ఇన్ని పైసలు లేక మళ్లా కట్టెల పొయ్యి మీదనే వండుకుంటాన. పేదోళ్లకు గ్యాస్ పొయ్యిలు ఇచ్చిన అని చెప్పుకునుడే తప్పా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్నింటి ధరలు పెంచింది. గ్యాస్, ఉప్పు, పప్పుల ధరలు తగ్గించేటోళ్ల ప్రభుత్వం రావాలే.