MCPI(U) | హనుమకొండ, జూన్ 28: భూభారతి చట్టాన్ని రైతులకు అనుకూలంగా ఎలాంటి లొసుగులు లేకుండా పక్కగా అమలు చేయాలని ఎంసీపీఐ(యూ) నాయకులు డిమాండ్ చేశారు. ఆ పార్టీ తెలంగాణ రాష్ర్ట కమిటీ పిలుపులో భాగంగా హనుమకొండ తహసీల్దార్ ఆఫీసులోని సీనియన్ అసిస్టెంట్ వినోద్‌కు శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు గడ్డం నాగరాజు మాట్లాడుతూ ఎన్ని కల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరుగ్యారంటీలను ప్రజలు నమ్మి కాంగ్రెస్‌కు ఓట్లు వేసి గెలిపించారన్నారు. ఏడో గ్యారంటీ ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణను విశ్వసించారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఒకటి, రెండు హామీలు తప్ప మిగిలిన హామీలకు బడ్జెట్ లేదన్నారు. ప్రజలకు పాలన అందించడంలో విఫలమయ్యారన్నారు. రాష్ర్టంలో విద్య, వైద్యం దోపిడీ విచ్చలవిడిగా పెరిగిందని, సీజన్ వ్యాధులు విజృంభిస్తున్నప్పటికి గ్రామాల్లో హెల్త్ క్యాంపులు లేవన్నారు. రాష్ర్టంలో ఇప్పటికీ వందలాది గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని, జాతీయ రహదారుల మినహా మిగిలిన రహదారులపై ప్రయాణం చేయాలంటే ప్రజలకు చుక్కలు కనిపిస్తునాన్నాయని వాపోయారు. రాష్ర్టంలో ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ మాఫియా తమ గుప్పెట్లోకి తీసుకొని వ్యాపారం చేస్తున్న అధికారులు నిరోధించడం లేదని పేర్కొన్నారు.
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కార్యకలాపాలు, ఇతర అవసరాలకు ప్రభుత్వ భూములు లేకుండా చేసే పరిస్థితి ఉందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలకు ఇల్లు ఇవ్వడం లేదని, రాజకీయ నాయకుల జోక్యంతో అసలైన లబ్ధిదారులు మోసపోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ప్రభుత్వం చేయూత పింఛన్లపై ఇచ్చిన హామీ అమలు కావడం లేదన్నారు. బస్, రైలు చార్జీలు, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మొగిలి శ్రీనివాసరావు, నీల ప్రశాంతి, మడత అరుణలక్ష్మి, చీపురు ఓదయ్య, తదితరులు పాల్గొన్నారు.