స్టేషన్ ఘన్పూర్, మార్చి 15 : ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం స్టేషన్‌ఘన్‌పూర్ పర్యటనకు వస్తున్నారని, ఆయన పాల్గొనే సభను అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హెచ్చరించారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన శనివారం స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంపై జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ అమలు చేయని హామీలపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేశారన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి దుశ్చర్యలకు కాంగ్రెస్ సర్కారు పాల్పడుతున్నదన్నారు. భారతదేశంలో అట్టర్ ఫ్లాప్ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎవరైతే రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తారో వాళ్లను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరితో ఏర్పాటు చేసిన సభకు రావడం సిగ్గు చేటన్నారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేయడానికి తూతూమంత్రంగా శంకుస్థాపనలు చేసి పోదామని అనుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చేతిలో చిల్లి గవ్వలేదని, కనీసం రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఏడాది గడిచినా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం దారుణమని రాజయ్య అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, మాజీ జడ్పీటీసీ మారపాక రవి, మాజీ సర్పంచ్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.