వేలేరు, సెప్టెంబర్ 14 : స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఉపఎన్నిక వస్తే ఎమ్మెల్యే కడియం శ్రీహరికి డిపాజిట్ కూడా రాదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య జోస్యం చెప్పారు. ఆదివారం ‘ఊరూరా బీఆర్ఎస్ సంక్షేమాలు-ఇంటింటికీ కేసీఆర్ పథకాలు’ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని బండతండా, చింతలతండా, కమ్మరిపేట, లోక్యతండా, సోడాషపల్లి, మల్లికుదుర్ల గ్రామాల్లో ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అవకాశవాదులంతా కడియం శ్రీహరి వెంట ఉన్నారని, ఇందిరతో ఉన్నోళ్లే అసలైన కాంగ్రెస్ కార్యకర్తలని అన్నారు. రానున్న రోజుల్లో కడియం శ్రీహరి కచ్చితంగా రాజీనామా చేస్తాడని, లేదంటే సుప్రీం కోర్టు తీర్పుతో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించే అవకాశముందన్నారు. ఏడాది క్రితం తాను కాంగ్రెస్‌లో చేరానని పబ్లిక్ మీటింగ్ శ్రీహరే స్వయంగా చెప్పారని, దానినే స్పీకర్‌కు లిఖిత పూర్వకంగా అందజేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్‌తో బేరం కుదిరే వరకు ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిన కడియం అనుకున్న మేరకు గిట్టుబాటు కాగానే ఆ పార్టీ కండువా కప్పుకున్నాడని ఎద్దేవా చేశారు. దేవాదుల ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి రెండు పంటలకు నీళ్లిచ్చే వరకు పోరాటం చేస్తానని రాజయ్య పేర్కొన్నారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, మండల ఇన్చార్జి భూపతిరాజు, మాజీ వైస్ ఎంపీపీ సంపత్, నాయకులు మల్కిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, గోవింద సురేశ్, జానీ, పోలు తిరుపతి, కొయ్యడ శ్రీనివాస్, భట్టు ప్రభాకర్, మారబోయిన రాజు తదితరులున్నారు.