TGSRTC | హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 6: ఈనెల 8న వరలక్ష్మీ వ్రతం, 9న రాఖీ పండుగ సందర్భంగా వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల నుంచి ఉప్పల్‌కు అదనపు బస్సులు నడపడం జరుగుతుందని రీజినల్ మేనేజర్ డి.విజయభాను తెలిపారు. ఉప్పల్ నుంచి హనుమకొండకు 7వ తేదీన 70 బస్సులు, 8న 130, 9న 105 బస్సులు, హనుమకొండ నుంచి ఉప్పల్‌కు 10వ తేదీన 105 బస్సులు, 11న 130 బస్సులు నడపనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా హనుమకొండ బస్ స్టేషన్, ఉప్పల్ పాయింట్లలో 24 గంటలు ఆఫీసర్లు, సిబ్బంది ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించడానికి ప్రత్యేక విధులు నిర్వహించడం జరుగుతుందని, ప్రయాణికుల సౌకర్యార్థం ఉప్పల్‌లో టెంట్లు, తాగునీటి సదుపాయం, పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల పరిధిలోని బస్ స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాల ప్రయాణికుల రద్దీని అనుసరించి అదనపు బస్సులు నడపడం జరుగుతుందని, 24 గంటలు ఆఫీసర్లు, సిబ్బంది ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించే విధులు నిర్వహిస్తారన్నారు. రాఖీ పండుగ అనేది అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళ మధ్య అనుబంధాన్ని బలోపేతం చేసే పండుగ.. ఈ రోజున, సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి, అతని క్షేమాన్ని కోరుకుంటుంది. బదులుగా, సోదరుడు తన సోదరికి రక్షణ కల్పిస్తానని వాగ్దానం చేస్తాడు.. ఇది ప్రేమ, రక్షణ సోదరభావానికి ప్రతీక అయిన పండుగ. ఈ సందర్భంగా వరంగల్ రీజియన్ పరిధిలోని సోదర సోదరీమణులంతా వారి రాఖీ పండుగ ప్రయాణాన్ని ఆర్టీసీ బస్సులలోనే కొనసాగించాలని, సురక్షిత, ఆనందకర ప్రయాణ అనుభూతిని పొందాలని ఆర్ఎం విజయభాను కోరారు.