Fiber Fruits | శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో ఫైబర్ ఒకటి. మొత్తం శరీర ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. మొక్కల ఆధారిత ఫైబర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంలో, గట్ మైక్రోబయోమ్ ను నిర్వహించడంలో, మలబద్దకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరానికి ఇతర పోషకాల లాగా ఫైబర్ కూడా చాలా అవసరం. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చిక్కుళ్లు, తృణ ధాన్యాలు వంటి వాటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అయితే పండ్లను తీసుకోవడం ద్వారా రుచికరంగా, అనుకూలంగా, సులభంగా తగినంత ఫైబర్ ను పొందవచ్చు. కనుక ఫైబర్ ను ఎక్కువగా అందించే వివిధ రకాల పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లల్లో పాషన్ ఫ్రూట్ ఒకటి. దీనిలో కరిగే, కరగని రెండు రకాల ఫైబర్ లు ఉంటాయి. దీనిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ కు మద్దతును ఇస్తుంది. జామకాయలో 100గ్రాములకు గాను 5 నుండి 6 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. దీనిలో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మలబద్దకం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ప్రేగు కదలికలు మెరుగుపడతాయి. పియర్స్ కూడా కరిగే, కరగని రెండు రకాల ఫైబర్ ను కలిగి ఉంటాయి. ఈ పండ్లు ఎక్కువగా వాటిపై తొక్కలో ఫైబర్ ను కలిగి ఉంటాయి. అధిక ఫైబర్ ను పొందాలంటే ఈ పండ్లను తొక్కతో సహా తీసుకోవాలి. పియర్స్ ను తొక్కతో సహా తీసుకోవడం వల్ల ప్రేగు కదలికలు మెరుగుపడి మలబద్దకం సమస్య తగ్గుతుంది.
100గ్రాముల రాస్ప్బె ర్రీస్ ను తీసుకోవడం ద్వారా 6 నుండి 7 గ్రాముల ఫైబర్ ను పొందవచ్చు. వీటిలో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోఈ ఫైబర్ దోహదపడుతుంది. దీనిలో ఉండే కరగని ఫైబర్ ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇక ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లల్లో ఆపిల్స్ కూడా ఒకటి. మధ్యస్థంగా ఉండే ఒక ఆపిల్ లో దాదాపు 4 నుండి 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. దీనిలో కరిగే ఫైబర్ పెక్టిన్ అధికంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. ఈ ఆపిల్ పండ్లను తొక్కతో సహా తీసుకోవడం ద్వారా అధిక ఫైబర్ ను పొందవచ్చు. అరటిపండ్లల్లో 100గ్రాములకు గాను 2.6 నుండి 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. వీటిలో ఎక్కువగా కరిగే ఫైబర్ ఉంటుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియను నెమ్మదించడంలో ఇది ఉపయోగపడుతుంది.
అలాగే బ్లాక్బెర్రీస్ కూడా ఫైబర్ పవర్ హౌస్ అని చెప్పవచ్చు. వీటిలో 100 గ్రాములకు 5 నుండి 7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. బ్లాక్బెర్రీస్ లో కరిగే, కరగని రెండు రకాల ఫైబర్ లు ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఆరోగ్యకరమైన ప్రేగు పనితీరును ప్రోత్సహించడంలో ఇవి దోహదపడతాయి. అదే విధంగా కివి పండ్లు కూడా 100గ్రాములకు 3 నుండి 4 గ్రాముల ఫైబర్ ను కలిగి ఉంటాయి. వీటిలో కరిగే, కరగని రెండు రకాల ఫైబర్ లు ఉంటాయి. వీటిని తొక్కతో సహా తీసుకోవడం వల్ల అధిక ఫైబర్ ను పొందవచ్చు. ఈ విధంగా రోజూ పండ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ఫైబర్ లభిస్తుంది.