సుబేదారి, ఆగస్టు 20 : నాలుగు నెలల ముందుగానే మద్యం షాపులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న వైన్స్ గడువు వచ్చే డిసెంబర్‌తో ముగియనుంది. కానీ ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు మద్యం షాపుల నిర్వహణకు టెండర్లు పిలుస్తూ ఈ నెల 14న ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పరిధిలో మొత్తం 294 షాపులున్నాయి.
కాగా, గత కేసీఆర్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన రిజర్వేషన్లనే అమలు చేస్తున్నట్లు పేర్కొంది. గౌడ్స్‌కు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం షాపులు కేటాయించారు. అయితే టెండర్ ఫీజును రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష పెంచింది. గతంలో రూ. 2 లక్షలుండగా, ఈసారి రూ. 3 లక్షలు చెల్లించేలా ఉత్తర్వులిచ్చింది. రెండేళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించే పన్ను వివరాలను వెల్లడించింది.
5 వేల జనాభా పరిధి షాపులకు రూ. 50 లక్షలు, 5 వేల నుంచి 50 వేలుంటే రూ. 55 లక్షలు, లక్ష లోపు షాపులకు రూ. 60 లక్షలు, 5 లక్షల లోపుంటే రూ. 65 లక్షలు, 20 లక్షల వరకుంటే రూ. 85 లక్షలు, 20 లక్షలకు పైగా జనాభా ఉంటే రూ. 1.10 కోట్లు ఆరు దఫాల్లో చెల్లించాలని పేర్కొంది. కాగా, పాత వరంగల్ అర్బన్ జిల్లా (హనుమకొండ)లో 65 షాపులు, వరంగల్ రూరల్ (వరంగల్) 63, జనగామ 47, మహబూబాబాద్ 59, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు కలిపి 60, మొత్తం 294 మద్యం దుకాణాలు ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నాయి. దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్‌ను జీవోలో తెలియపర్చలేదు.