జిల్లాలోని తండాలు, గ్రామీణ ప్రాంతాల రోడ్లకు మహర్దశ పట్టనుంది. ఉమ్మడి రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి, మరమ్మతును నాటి పాలకులు పట్టించుకోకపోవడంతో గుంతలమయమైన రోడ్లతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక సీఎం కేసీఆర్ గ్రామాల నుంచి మండలాలు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, తండాల రోడ్లకు మహర్దశ పట్టింది. గతేడాది జిల్లాలోని మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా మార్చేందుకు ఐటీడీఏ ద్వారా రాష్ట్ర సర్కారు నిధులు ఇచ్చింది. ఈ ఏడాది మరికొన్ని గ్రామాలు, తండాల్లో రోడ్ల కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. మొత్తం 138 పనుల ద్వారా 227 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ.224.52 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇన్ని రోజులు అధ్వానంగా ఉన్న రోడ్లు బాగుపడుతుండడంతో తండాల ప్రజలు సంబురపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
మహబూబాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగా ణ) : జిల్లాని రోడ్లకు మహర్దశ పట్టనుంది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 18 మండలాల్లో బీటీ రోడ్లు వేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. 227 కిలోమీటర్ల మేర రోడ్లు వేసేందుకు 138 పనుల కోసం రూ.224.52 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీంతో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉన్న రోడ్లకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మహబూబాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో 9 పనుల ద్వారా 16.25 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ.16.42కోట్ల నిధులిచ్చింది. వీటితో నియోజకవర్గంలోని ప్రతి మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
డోర్నకల్ నియోజకవర్గం లో 31 పనుల ద్వారా 60.30 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ 49.73 కోట్లు, పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండలంలో 4 రోడ్ల పనుల ద్వారా 5.20 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ.4.24కోట్లు, పెద్ద వంగర మండల పరిధిలో రెండు పనుల ద్వారా నాలుగు కిలోమీటర్ల మేర రోడ్ల కోసం రూ.3.20 కోట్లు, ఇల్లందు నియోజకవర్గం బయ్యారం మండలంలో 16.25 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ.16.4కోట్లు, గార్ల మండలంలోని మూడు పనుల ద్వారా 2.60 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ.1.82 కోట్లు, ములుగు నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడ మండలంలో 8 పనులకు 15.3 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ.24.71కోట్ల నిధులను మంజూరు చేసింది. నియోజకవర్గంలోని గంగారం మండలంలో ఒక పని ద్వారా 3 కిలోమీటర్ల రోడ్డు కోసం రూ.2.40 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా 138 పనుల ద్వారా 227 కిలోమీటర్లు రోడ్ల కోసం రూ. 224.52 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గతేడాది ఇల్లందు నియోజకవర్గంలో 31 పనుల ద్వారా 50.11 కిలోమీటర్ల రోడ్డుకు రూ.44.3 కోట్లు, మహబూబాబాద్ నియోజకవర్గంలో 34 పనుల ద్వారా 61.91 కిలోమీటర్ల రోడ్లకు రూ.44.56 కోట్లు, డోర్నకల్ నియోజకవర్గంలో 31 పనుల ద్వారా 60.30 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ.49.73 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడాది కూడా మట్టి రోడ్ల బీటీగా మార్చేందుకు ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. దీంతో తండాల ప్రజలు సంబురపడుతున్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే తండాలకు మహర్దశ పట్టింది. ఇప్పటికే తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ప్రభుత్వం బీటీ రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరు చేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గిరిజన సంక్షేమ శాఖ నుంచి గిరిజన ఆవాసాలకు రోడ్ల నిర్మాణం కోసం అత్యధిక నిధులు కేటాయించాం. గతేడాది నియోజకవర్గాల వారీగా ఇల్లందు కు 31 పనుల ద్వారా 50.11 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ.44.3 కోట్ల మంజూరు ఇస్తే, ఈ ఏడాది 20 పను ల ద్వారా 35.65 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ.34.06కోట్లు మంజూరు చేశాం. మహబూబాబాద్ నియోజకవర్గానికి గతేడాది 34 పనుల ద్వారా 61.91 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ.44.56 కోట్ల మంజూరు ఇస్తే, ఈ ఏడాది 80 పనుల ద్వారా 120.35 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ.92 కోట్లు ఇచ్చాం. గతేడాది డోర్నకల్ నియోజకవర్గానికి 31 పనుల ద్వారా 60.30 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ.49.73 కోట్లు మంజూరు ఇస్తే, ఈ ఏడాది 78 పనుల ద్వారా 127.35 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ.117.82 కోట్లు మంజూరు ఇచ్చాం. గిరిజన ఆవాసాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు గిరిజన ప్రత్యేక అభివృద్ధి శాఖ నుంచి నిధులను మంజూరు చేస్తున్నది. చాలా ఏళ్లుగా అధ్వానంగా ఉన్న రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు కావడంతో తండాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమైక్య పాలనలో జిల్లాలోని అత్యధిక గ్రామాలకు రోడ్లులేని పరిస్థితి ఉండేది. అరకొర నిధులను మాత్రమే కేటాయించేవారు. కనీసం రోడ్ల మరమ్మతుకు నిధులివ్వని దుస్థితి ఉండడంతో గుంతల రోడ్లతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్లలో రోడ్ల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయించారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి పనుల ప్రారంభానికి అవసరమైన చర్యలు చేపడతాం.
సత్యవతిరాథోడ్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి