Warangal | హనుమకొండ చౌరస్తా, మార్చి 22 : ఉద్యమకారుల న్యాయమైన హక్కులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 24న ఓరుగల్లుకు బస్సుయాత్ర కరీంనగర్ నుండి హనుమకొండ అమరవీరుల స్థూపం వద్దకు రానున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నందగిరి రజనీకాంత్ తెలిపారు.
శనివారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో రజనీకాంత్ మాట్లాడుతూ.. ఈ నెల 24 న నిర్వహించనున్న బస్సు యాత్రలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ అధ్యక్షులు చీమ శ్రీనివాస్ నిర్వహిస్తున్న బస్సు యాత్రలో ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమకాలంలో భాగంగా వందలాది మంది యువకులు అమరులయ్యారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల సాక్షిగా ఉద్యమకారులకు సముచిత ప్రాతినిధ్యం లభించకుండా రాజకీయ పార్టీలు కుతంత్రాలు నడిపిస్తూ హక్కులను హరించి వేస్తున్నాయన్నారు.
సబ్బండ వర్గాల ప్రజలు తమ అభీష్టం మేరకు ఉవ్వెత్తున జరిపిన ఆటపాట మానవహారాలు వంటవార్పూ రహదారులపై నిర్వహించి ప్రభుత్వ పాలనను స్తంభింపజేసిన తెలంగాణ రాష్ట్ర సాధన జరుపుకున్న ప్రజల గొంతుకను నొక్కి వేస్తుంది. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి 250 గజాల స్థలం అమరులైన కుటుంబాలకు పెన్షన్ అదేవిధంగా హెల్త్ కార్డులు అందజేయాలని డిమాండ్ చేసారు. వీటి సాధనకోసం ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజక వర్గ కన్వినర్ అనుముల రమేష్, వరంగల్ పార్లమెంటరీ కన్వినర్ వోడపల్లి శ్యామ్ కృష్ణ, ఉమ్మడి వరంగల్ జిల్లా కార్మిక విభాగ అధ్యక్షుడు జమ్మాల నాగరాజు, ఓడపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.