తీరొక్క నేలలు.. అన్ని రకాల పంటలు.. పుష్కలమైన నీటి వనరులు.. నిరంతర ఉచిత విద్యుత్.. అదునుకు పెట్టుబడి సాయం ఇచ్చే రైతుబంధుతో వ్యవసాయం పండుగలా మారడమే గాక విత్తనోత్పత్తికి తెలంగాణ కేంద్రమైంది. ఒకప్పుడు కొన్ని మండలాలకే పరిమితమైన విత్తన పంటల సాగు నేడు క్రమంగా రాష్ట్రమంతటికీ విస్తరించి.. దేశవిదేశాలకు విత్తనాలు ఎగుమతి చేసే స్థాయికి చేరింది. ఏటా 44 లక్షల టన్నులు విత్తనాలు ఉత్పత్తి అవుతుండగా వీటిలో వరి, మక్కజొన్న సీడ్స్ భారీగా ఉత్పత్తి చేస్తున్నారు. మంచి విత్తనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మన రైతులు.. ప్రైవేట్ కంపెనీల సహకారంతో మేలు రకం, ఎక్కువ దిగుబడినిచ్చే సీడ్స్‌ను సాగుచేస్తూ లాభాలు గడిస్తున్నారు. సాధారణ వరి కంటే విత్తన వరికి అదనంగా రూ.40వేలు. విత్తన మక్కజొన్నకు రూ.30వేల దాకా మిగులుతుండడంతో దాదాపు అన్ని గ్రామాల రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో సాగవుతుండగా ఏటేటా విత్తన సాగు విస్తీర్ణం పెరుగుతోంది.
– వరంగల్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రతి పంట సాగుకు విత్తనమే మూలం. ఆ విత్తనాల ఉత్పత్తిలో తెలంగాణ గణనీయ పురోగతి సాధించింది. ఒకప్పుడు కొన్ని మండలాలకే పరిమితమైన విత్తన పంటల సాగు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. మేలు రకం, ఎక్కువ ఉత్పత్తి వచ్చే విత్తనాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మంచి విత్తనాల కోసం దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నది. తెలంగాణ రైతులు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టులు, నిరంతరం సరఫరా చేస్తున్న కరంటుతో విత్తన పంటలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో కాకతీయ కాల్వ దిగువ భాగంలో మాత్రమే సాగయ్యే ఈ పంటలు ఇప్పుడు అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ముఖ్యంగా హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో విత్తన పంటల సాగు ప్రతి ఏటా పెరుగుతున్నది. ఒకప్పుడు వరి విత్తనాల పంటనే సాగు చేసే రైతులు ఇప్పుడు మక్కజొన్న విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోనే దాదాపు రెండు లక్షల ఎకరాల్లో సాగవుతున్నదని వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారించారు.
అన్ని జిల్లాల్లో విత్తన పంటల సాగు..
దేశంలో సాగయ్యే అన్ని పంటల విత్తనాల్లో 40 శాతం వరకు తెలంగాణలోనే ఉత్పత్తి అయిన వాటినే వాడుతున్నారు. అన్ని పంటలకు కలిపి సగటున ప్రతి ఏటా 44 లక్షల టన్నుల విత్తనాల ఉత్పత్తి జరుగుతున్నది. దిగుబడి ఎక్కువగా ఉండే హైబ్రిడ్ వరి సాగు విస్తీర్ణం ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెరుగుతున్నది. ఈ రకమైన విత్తనాలు తెలంగాణ నుంచే 50 వరకు ఉత్పత్తి అవుతున్నాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళ నాడు, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో మన విత్తనాలు సాగవుతున్నాయి. చైనా, వియ త్నాం, థాయిలాండ్, బంగ్లాదేశ్‌తో పాటు మరో పది దేశాలకు తెలంగాణ విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి.
సాగునీటి వనరులు పుష్కలంగా ఉండ డంతో ఇప్పుడు దాదాపు అన్ని జిల్లాల్లో విత్తన పంటల సాగు పెరిగింది. హైబ్రిడ్ విత్తనాల సాగును వాడుకలో ఆడ, మగ పంట అంటారు. సాధారణ పంటతో పోల్చితే విత్తన పంట సాగు క్లిష్టంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా విత్తనాలను ఉత్పత్తి చేసే కంపెనీలు ఇప్పుడు ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలోనే కార్యకలాపాలు పెంచుతున్నాయి. పంటల సాగుకు, ముఖ్యంగా విత్తన పంటల సాగుకు అవసర మైన వాతావరణ పరిస్థితులు మన రాష్ట్రంలో ఉంటాయి. పంటకు అవసరమైన సాగునీరు, కరంటుకు ఇబ్బందులు లేవు. పంట పండడం గ్యారెంటీ అనే భావనతో కంపెనీలు ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంపైనే దృష్టి పెట్టాయి. హనుమకొండ జిల్లాలోనే 62 కంపెనీలు విత్తనాలను ఉత్పత్తి చేయిస్తున్నాయి. వరి, మక్కజొన్న విత్తన పంటలను రైతులతో సాగు చేయిస్తున్నాయి. కమలాపూర్, ఎల్కతుర్తి మండలాల్లో 20 ఏండ్ల క్రితం మొదలైన విత్తన పంట సాగు ఇప్పుడు ప్రతి ఊరిలోనూ ఉన్నది. జిల్లావ్యాప్తంగా చాలా గ్రామాల్లో రైతులు విత్తన పంటలనే సాగు చేస్తున్నారు.
రైతులకు అదనపు ఆదాయంసాధారణ వరి పంట సాగుతో రైతులకు పెట్టుబడి పోను ఎకరానికి రూ.20 వేల వరకు మిగులుతాయి. విత్తన వరిలో మాత్రం రూ.40వేల వరకు మిగిలే అవకాశం ఉండడంతో జిల్లాలోని అనేక మంది రైతులు ఆడమగ వరి పండించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వరి సాగు అనుభవాలతో ఇప్పుడు ఆడ, మగ మక్కజొన్నను సాగు చేస్తున్నారు. విత్తన వడ్లు క్వింటాలుకు రూ.6500 నుంచి రూ.12 వేల వరకు కంపెనీలు చెల్లిస్తున్నాయి. విత్తన మక్కజొన్న క్వింటాలుకు రూ.2,200 నుంచి రూ.3 వేల వరకు ధర వస్తున్నది. విత్తన వరి సాగుతో ఎకరాకు రూ.40 వేలు, విత్తన మక్కజొన్నకు రూ.30 వేల వరకు లాభం ఉంటున్నది. దీంతో విత్తన పంట విస్తీర్ణం ప్రతి ఏటా పెరుగుతున్నది. ఓపెన్ పాలినేషన్(ఓపీ) రకాల వరి సాగు ఇటీవల పెరిగింది. జిల్లా పరిధిలోనే 40వేల ఎకరాల్లో విత్తనోత్పత్తి చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలిపి రెండు లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దీంతో రైతులు ఏటా రూ.150 కోట్ల వరకు లాభపడుతున్నారు.
రైతుల్లో ఆసక్తి పెరిగింది..
గతంతో పోల్చితే తెలంగాణ రాష్ట్రం వచ్చినంక రైతుల్లో విత్తనోత్పత్తి సాగుపై ఆసక్తి పెరిగింది. అంతకుముందు కొందరు రైతులే వరి, మక్కజొన్న విత్తన పంటలు సాగు చేసేవారు. సాగుకు అనుకూల పరిస్థితులు రావడంతో ఇప్పుడు ఎక్కువ మంది ఈ పంటను సాగు చేస్తున్నారు. సాగునీరు, కరంటు సరఫరా గతంలో కంటే చాలా మెరుగు కావడంతో రైతులు ఈ పంటలను సాగు చేస్తున్నారు.
– పామెర సుమన్‌రావు, కావేరి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్
విత్తన వడ్లు పండిస్తున్న..
మునుపు బాయిల నీళ్లు సక్కగ ఉండేటివి కాదు, ఇప్పుడు మా పక్కనే ఉన్న చెరువును పూడిక తీసిన కాన్నుంచి నీళ్లు మస్తు ఉంటాయ్. యూఎస్ ఆగ్రి వాళ్లు ఇస్తున్న మగ రకం వడ్లను ఎనిమిది ఎకరాల్లో సాగుచేస్తున్న. వానకాలం, యాసంగి ఇదే పంటను పండిస్తున్నా. క్వింటాలుకు రూ.2600 చొప్పున ఇస్తున్నరు. ఎకరాకు 30 క్వింటాళ్ల కంటే ఎక్కువ దిగుబడి వస్తున్నది.
– గూడెపు సమయ్య, ఎల్కతుర్తి