కరీమాబాద్, ఆగస్టు 26: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో వరంగల్ రంగశాయిపేటలోని మంకీ ఫుడ్ కోర్టులో మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా మొక్కలు నాటారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు విడుతలుగా చేపట్టిన హరితహారంతో నగరాలు, పల్లెలు పచ్చగా ఉన్నాయని తెలిపారు. గతంలో చేపట్టిన హరితహారంలో భాగంగా దాదాపు వందలాది రకాల మొక్కలు నాటామన్నారు. ఇప్పుడు విరివిగా మొక్కలు నాటుతున్నట్లు వివరించారు. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ప్రజలు అండగా నిలువాలని కోరారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. భావితరాలకు పచ్చని ప్రకృతిని కానుకగా అందిద్దామని కోరారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా, కార్పొరేటర్ రవి, నాయకులు వనం కుమార్, ఆవునూరి రామ్మూర్తి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
దుగ్గొండి/చెన్నారావుపేట: పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దుగ్గొండి ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య అన్నారు. మండలంలోని రేఖంపల్లి, చలపర్తి, మందపల్లి, పీజీతండా, నాచినపల్లి, శివాజీనగర్, దుగ్గొండిలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో గోల్కొండ కృష్ణప్రసాద్, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, ఎస్సై జక్కుల పరమేశ్వర్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్ పాల్గొన్నారు. అలాగే, చెన్నారావుపేట మండలవ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. మండలకేంద్రంలో ఎంపీడీవో భారతి, సర్పంచ్ కుండె మల్లయ్య ఆధ్వర్యంలో బృహత్ పల్లెప్రకృతి వనంలో మొక్కలు నాటారు. అమీనాబాద్‌లో జడ్పీటీసీ పత్తినాయక్, సొసైటీ చైర్మన్ మురహరి రవి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, ఎంపీటీసీలు, ఎంపీవో శ్రీధర్‌రాజు, నాయకులు మహేందర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, గట్లరాంబాబు పాల్గొన్నారు.
మొక్కలతోనే మానవ మనుగడ..
ఖానాపురం/నల్లబెల్లి: మొక్కలు నాటి సంరక్షిస్తేనే మానవ మనుగడ సాధ్యమని ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, నర్సంపేట ఏపీడీ సాయిచరణ్ అన్నారు. కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా మండలవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మొక్కలు నాటారు. బుధరావుపేటలో ఎంపీపీ, ఖానాపురంలో ఏపీడీ మొక్కలు నాటారు. ఎంపీడీవో సుమనావాణి, సర్పంచ్‌లు కాస ప్రవీణ్‌కుమార్, చిరంజీవి, కార్యదర్శులు రజిత, సుప్రజ పాల్గొన్నారు. నల్లబెల్లి మండలంలోని కొండాపూర్ బృహత్ పల్లెప్రకృతి వనంలో మొక్కలు నాటారు. సర్పంచ్ గూబ తిరుపతమ్మ, కార్యదర్శి రజితతో కలిసి ఎంపీడీవో విజయ్‌కుమార్ వెయ్యి మొక్కలు నాటినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గూబ రాజు, మన్మోహన్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఎంపీవో కూచన ప్రకాశ్ మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసుల పరిశీలన బృందంతో కలిసి రాంపూర్‌లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అధికారులు సందీప్ కర్యత్, పవన్రావల్, పంకజ్ గార్గ్, బూపేంద్రసింగ్ మీనా, నీలం మణికుమార్, సర్పంచ్ సీహెచ్ సురేశ్రావు, ప్రశాంత్ పాల్గొన్నారు.
మొక్కలు నాటి.. నీళ్లు పోసి..
నర్సంపేటరూరల్/నెక్కొండ: నర్సంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకుల ఆద్వర్యంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. చంద్రయ్యపల్లిలో సర్పంచ్ బరిగెల లావణ్య, ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి శ్రావణకుమారితోపాటు వార్డు సభ్యుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. లక్నేపల్లిలో ఎంపీడీవో అంబాల శ్రీనివాసరావు, ఎంపీవో అంబటి సునీల్‌కుమార్‌రాజ్, ఏపీవో ఫాతిమామేరీ, సర్పంచ్ గొడిశాల రాంబాబుగౌడ్, ఎంపీటీసీ ఉల్లేరావు రజిత, కార్యదర్శి అనిత, ఎంపీటీసీ పరాచికపు శ్యామ్‌సుందర్, ఉప సర్పంచ్ పరాచికపు సంతోష్ ఆధ్వర్యంలో, కమ్మపల్లిలో జడ్పీటీసీ కోమాండ్ల జయ, సర్పంచ్ వల్గుబెల్లి రంగారెడ్డి, ఎంపీటీసీ వల్గుబెల్లి విజయ-ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు రకాల మొక్కలు నాటి నీళ్లు పోశారు. అదేవిధంగా ముగ్దుంపురం శివారు జయముఖి ఇంజినీరింగ్ కళాశాలలో సర్పంచ్ పెండ్యాల జ్యోతి-ప్రభాకర్ ఆధ్వర్యంలో తె మొక్కలు నాటారు. నెక్కొండ మండలం అలంకానిపేటలో సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మీ రవి ఆధ్వర్యంలో జోరుగా మొక్కలు నాటారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణ, రహదారి వెంట, పల్లెప్రకృతి వనంలో విరివిగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుంటుక నర్సయ్య, కార్యదర్శి మధు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, యువకులు పాల్గొన్నారు.