పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాకుండా వారు ఆత్మగౌరవంతో జీవించాలని బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కాయకష్టం చేసుకుని బతికే పేదలను అర్హులుగా ఎంపిక చేసి డబుల్ బెడ్రూం ఇండ్లను పారదర్శకంగా కేటాయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీలు, సముదాయాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించింది. కాలనీల నిర్వహణ పక్కాగా చేపట్టడంతో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పట్టింపులేని తనంతో డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గజ్వేల్, మార్చి 10: సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాఫూర్ మున్సిపల్ పరిధిలోని సంగాపూర్ డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీలో సమస్యలు తాండవిస్తున్నాయి. లక్కీ డ్రాలో ఇండ్లు దక్కించుకున్న లబ్ధిదారులు, అధికారులు కేటాయించిన ఇంటి నెంబర్ ఆధారంగా గృహప్రవేశాలు చేసి నివసిస్తున్నారు. కాలనీలో 50శాతం మంది లబ్ధిదారులు ఇండ్లలో నివాసం ఉంటున్నారు. కాలనీలో వసతుల కల్పనలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి.
కేసీఆర్ చొరవతో …
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ చొరవతో గజ్వేల్ పట్ణణ సమీపంలోని సంగాపూర్ వద్ద సర్వేనెంబర్ 68లో 1250 డబుల్ బెడ్రూం ఇండ్లను గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్మించారు. ఒక్కో ఇల్లు 570 చదరపు గజాల విస్తీర్ణంలో 156 బ్లాక్‌ల్లో నిర్మాణం పూర్తిచేశారు. ఇందులో ఒక్కో బ్లాక్‌లో కింద, పైన కలిపి ఎనిమిది ఇండ్లను నిర్మించారు. కాలనీలో విద్యుత్, మురుగుకాల్వల నిర్మాణం, రోడ్లు, భగీరథ నీటి సరఫరా, ఫంక్షన్ హాల్ నిర్మాణం తదితర సౌకర్యాలను అప్పట్లో పూర్తి చేశారు. నిర్మాణాలు పూర్తయిన కొద్ది రోజులకే మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు తాత్కాలికంగా రెవెన్యూ అధికారులు ఇండ్లను కేటాయించారు.
ఐదేండ్ల క్రితం తాత్కాలిక ఇండ్లలోకి వచ్చిన ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు వాటిని ఖాళీ చేయకపోవడంతో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని అన్ని రకాల ప్యాకేజీలు వచ్చిన వారిని కొంతమంది నిర్వాసితులను ఖాళీ చేయించారు. అనంతరం వారం రోజులుగా రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అధికారులు మిగతా వారిని ఖాళీ చేయిస్తూ, డ్రాలో ఇండ్లు వచ్చిన అర్హులైన వారికి నెంబర్ల ఆధారంగా ఇండ్లను కేటాయిస్తున్నారు. ఎన్నో ఏండ్ల నిరుపేదల ఆశల సౌధం ఇప్పుడిప్పుడే వారి సొంతమవుతున్నది. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో నిరుపేదల కోసం 1250 డబుల్ బెడ్రూం ఇండ్లను అత్యద్భుతంగా నిర్మించారు. అక్కడ అన్ని రకాల వసతులు కల్పిస్తూ నిర్మాణాలు పూర్తి చేశారు. 2023 మార్చి 21న తుది లక్కీ డ్రా తీసి, అర్హులైన 1100మందిని ఎంపిక చేసిన వారికి ఇండ్లను అందజేస్తున్నారు.
చెత్త కుప్పలతో పరిసరాలు అపరిశుభ్రం
సంగాపూర్ డబు ల్ బెడ్రూం ఇండ్ల కాలనీలో సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవ రూ పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. కాలనీలో సగం మంది వరకు లబ్ధిదారులు నివసిస్తున్నా, ఇండ్ల మధ్య పేరుకుపోయిన చెత్తను తొలిగించడం లేదు. దీంతో చెత్తతో దుర్వాసన వస్తున్నదని, పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో సమస్యలు పరిష్కరిస్తేనే ఎన్నికల్లో ఓటు వేస్తామని స్థానికులు ధర్నా చేపట్టారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయి కొత్త పాలకవర్గం ఏర్పాటైనా ఎక్కడి సమస్యలు అక్కడే దర్శనమిస్తున్నాయి. రాత్రి సమయంలో వీధిలైట్లు లేకపోవడంతో అంధకారం అలుముకుంటున్నది. కుక్కల బెడద స్థానికులకు భయపెట్టిస్తున్నది. ఇప్పటికైనా అధికారులు, బల్దియా పాలకవర్గం చొరవ చూపి సమస్యలు పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.