దేవుని గుట్టను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. 50 ఎకరాల్లో విస్తరించిన కొండను గుల్ల చేస్తున్నారు. మైనింగ్ శాఖ అనుమతుల కోసం దరఖాస్తు ఇచ్చి.. మట్టిని ఎక్కువగానే తవ్వుతూ సొమ్మును జేబుల్లో నింపుకొంటారు. పర్యావరణ సమతుల్యానికి తూట్లు పొడుస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తారు. ఫలితంగా పచ్చని చెట్లతో ఉన్న గుట్టలను కొందరు అక్రమార్కులు మైదానాలుగా మార్చేస్తున్నారు. ఇదేమని అడిగితే ‘అభివృద్ధి కార్యక్రమాలకు సర్కారు భూముల నుంచి కాకుండా.. ఎక్కడి నుంచి మట్టిని తీయాలి’.. అన్న రీతిలో అధికారులు మాట్లాడుతున్నారని తుర్కలపల్లి వాసులు వాపోతున్నారు. ఇంత జరుగు తున్నా.. అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
– కల్వకుర్తి, మార్చి 10
కల్వకుర్తి మండలం తుర్కలపల్లి సమీపంలోని దాదాపు 50 ఎకరాల్లో దేవుని గుట్ట విస్తరించి ఉన్నది. గ్రామానికి మంచినీరు అందించే రెండు బోర్లు ఇక్కడే ఉన్నాయి. గుట్టకు చుట్టు పక్కల గ్రామస్తులకు చెందిన పశువులు, మేకలు, మూగజీవాలకు గ్రా సం అందిస్తుంది. అయితేనేం ఈ గుట్టపై అక్రమార్కులు కన్నుపడిం ది. పర్యావరణ సమతుల్యతకు ఆనవాళ్లుగా నిలిచిన గుట్టను మాయం చేసేందుకు శ్రీకారం మొదలైంది. గతేడాది హైవే-167కే పనులకు గుట్టను సగం తొలచి మట్టిని కొల్లగొట్టారు.
తాజాగా మరేదో రోడ్డు పనులకు ఈ గుట్ట నుంచే మట్టిని తరలిస్తున్నారు. ఇందులో విచిత్రం ఏమిటంటే.. కేవలం మైనింగ్ శాఖకు చేసుకున్న దరఖాస్తు కాగితాన్ని అడ్డుపెట్టి గుట్టను చెరబట్టారు. గ్రామ అవసరాలకు, పర్యావరణ పరిరక్షణకు అడ్డాగా ఉన్న దేవునిగుట్టను తొలగించకుండా కాపాడాలని నెల రోజులుగా గ్రామస్తులు కలెక్టర్‌ను కలిసి వినితిపత్రం అందజేశారు. ఈ గుట్ట నుంచి మట్టిని తొలగించవద్దని గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నా.. అధికార పార్టీ నేతలు వారికి వెన్నుదన్నుగా నిలిచారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొన్నది.

అనుమతులు.. అధికారం ముసుగులో..
తుర్కలపల్లి శివారు 522 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో చెట్లు, చేమలతో దేవునిగుట్ట విస్తరించి ఉన్నది. తిరుపతి జాతీయ రహదారి-167కే ఆనుకొని ఉన్న గుట్ట కాస్తా క్రమక్రమంగా వైభవాన్ని కోల్పోతున్నది. అనుమతుల ముసుగులో కొందరు, అధికారం ముసుగులో మరికొందరు మట్టిని తోడేస్తున్నారు. కల్వకుర్తి మండలంలో ఒక రోడ్డును బీటీ రోడ్డుగా మార్చే ప్రయత్నంలో భాగంగా గుట్ట నుంచి మట్టి తరలించుకుపోతున్నట్లు తెలిసింది. ఈ విషయమై తుర్కలపల్లి వాసులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘అభివృద్ధి కార్యక్రమాలకు సర్కారు భూముల నుంచి కాకుండా.. ఎక్కడి నుంచి మట్టిని తీసుకువస్తారు.. అయినా మట్టిని తీస్తే మీకు వచ్చే నొప్పి ఏమిటి?’ అన్న రీతిలో అధికారులు మాట్లాడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. మా గ్రామానికి ఆదెరువుగా ఉన్న గుట్టను మాయం చేస్తారా? అని తుర్కలపల్లి వాసులు మండిపడుతున్నారు.
దరఖాస్తు ఆధారంగానే..
కేవలం మైనింగ్ శాఖకు చేసుకున్న దరఖాస్తు ఆధారంగానే దేవునిగుట్ట నుంచి మట్టిని కొల్లగొడుతున్నారు. మట్టి లేదా? ఇసుక తీయడానికి మైనింగ్ శాఖ అంత సులువుగా అనుమతులు ఇవ్వదు. పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణ.. తదితర అంశాలను పరిగణనతోకి తీసుకున్న తర్వాత లోతుగా సమీక్ష జరిపి ఆ తర్వాతనే ఇసుక లేదా? మట్టి తవ్వకాలకు అనుమతులు ఇస్తుంది. ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో మట్టి.. లేదా..? ఇసుక తీయడానికి హద్దులు నిర్ణయిస్తుంది. క్యూబిక్ మీటర్లుగా లెక్కగట్టి ఇస్తుంది. దీనికి క్యూబిక్ మీటర్ చొప్పున సీనరీస్ తదితర చార్జీలు చెల్లించి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంత తతంగం ఉండగా కేవలం అనుమతుల కోసం దరఖాస్తు ఇచ్చి.. మట్టిని తవ్వుతున్నారంటే.. దీని వెనుక పెద్ద ఆర్థిక రాజకీయం ఉందనే విషయం ఇట్టే అర్థమవుతోంది.
గుత్తేదారు విషయానికొస్తే..
ఏదైనా ప్రభుత్వానికి చెందిన పని(రోడ్డు లేదా? వంతెన, భవనం) టెండర్ విధానం దక్కించుకున్న గుత్తేదారుకు ప్రభుత్వం కేవలం డబ్బులు మాత్రమే ఇస్తుంది. చేసిన పనిని లెక్కిస్తూ డబ్బులు ఇస్తుంది. వనరులు సమకూర్చదు. ఇదంతా అగ్రిమెంట్ చేసుకున్న డీపీఆర్‌లో స్పష్టంగా ఉంటుంది. రోడ్డు నిర్మాణానికి మట్టి, కంకర, సిమెంట్, స్టీల్, మిగతా మౌలిక వసతులను గుత్తేదారు మాత్రమే సమకూర్చుకోవాలి. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో రోడ్డు పనులకు మట్టి తీసుకుంటే.. ‘మీ సొమ్మేం పోతుంది’ అని అధికారులు, కొందరు అధికార పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడ టం చూస్తే.. ఎవరికి ఎవరు కొమ్ము కాస్తున్నారనే విష యం అర్థమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం మై నింగ్శాఖకు దరఖాస్తు చే సుకుని అక్రమంగా మట్టి తరలించుకుపోతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
దరఖాస్తు చేసుకున్నారు..
రోడ్డు పనులకు మట్టి కావాలని గుత్తేదారు.. మైనింగ్ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తు ఆధారంగా మట్టి తీసుకునే వీలుంటుంది. అయితే తీసుకున్న మట్టి ఆధారంగా సీనరీస్.. ఇతర చార్జీలను ఆ శాఖ వసూలు చేస్తుంది. అయినప్పటికీ మైనింగ్ శాఖ నుంచి అనుమతులు వచ్చే వరకు మట్టిని తీయవద్దని ఆదేశాలు ఇస్తాం. నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తీస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– ఇబ్రహీం, తాసీల్దార్, కల్వకుర్తి