మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అమెరికా, హైదరాబాద్ మధ్య నడిచే విమానాలపై ప్రభావం చూపుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న దాడుల పర్వంతో ఆర్థిక, సామాజిక, భౌగోళిక అంశాలపై ప్రతికూల ప్రభావం పడుతుండటంతో.. పలు దేశాలు తమ ఎయిర్‌స్పేస్‌లను మూసివేశాయి. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుండగా.. ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని విమాన సేవలు పూర్తిగా రద్దు అవుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.
సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): అమెరికా, ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులతో ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ ఘటనల తర్వాత గల్ఫ్ దేశాలు భద్రతా కారణాలరీత్యా తమ ఎయిర్‌స్పేస్‌ను మూసివేయడంతోపాటు, అంతర్జాతీయ విమాన మార్గాల్లోనూ మార్పులు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి, దోహా వంటి గల్ఫ్ హబ్‌లపై ఆధారపడే అమెరికా-హైదరాబాద్ విమాన మార్గాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఈ మార్గాల ద్వారా సాధారణంగా న్యూయార్క్, చికాగో, సాన్‌ఫ్రాన్సిస్కో వంటి నగరాల నుంచి వచ్చే ప్రయాణికులు కనెక్టింగ్ విమానాలపై హైదరాబాద్‌కు చేరుకుంటారు. కానీ ఇప్పుడున్న ఉద్రిక్తతల నడుమ ఆ మార్గాల ద్వారా విమాన ప్రయాణం ఇబ్బందిగా మారింది. ఉన్న ఫళంగా విమానాలను నిలిపివేయాల్సి వచ్చింది. అత్యవసరంగా మార్పులు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో ప్రయాణ సమయం గణనీయంగా పెరుగుతోంది. సాధారణంగా 16-18 గంటల్లో పూర్తయ్యే ప్రయాణం ప్రస్తుతం 22-26 గంటలు పడుతున్నట్లు సమాచారం.
పెరిగిన ధరలు, ఫ్లైట్ డిలేలు…
అమెరికా నుంచి వచ్చేవారికి కాకుండా, హైదరాబాద్ నుంచి అమెరికా, గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రయాణికులు చుక్కలు కన్పిస్తున్నాయి. ఎయిర్వేస్ నిలిపివేతల కారణంగా పెరుగుతున్న ప్రయాణదూరంతో ఇంధన వ్యయం అధికం అవుతుందనీ విమానసంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది. మార్చి 10-18వరకు రోమ్‌లో టెక్నికల్ స్టాఫ్‌తో పాటు, మొత్తం 78 అదనపు విమానాలను నడిపించేందుకు ఏర్పాట్లు చేసుకున్నది. అదేవిధంగా క్రూ డ్యూటీ, సమయ పరిమితులు కూడా ప్రభావితం అవుతున్నట్లుగా తెలిపింది. ఈ కారణాలతో కొన్ని విమానాల్లో 5-10 గంటల వరకు ఆలస్యం అవుతుందనీ, ఒక్కో ఫ్లైట్ అనివార్యంగానే రద్దు చేసుకోవాల్సి వస్తుందన్నారు.
మరోవైపు టికెట్ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. సాధారణ ధరలతో పోలిస్తే కొన్ని మార్గాల్లో ఏకంగా 150 శాతం మేర పెరుగుదల ఉందని విమానశ్రయ వర్గాలు తెలిపాయి. అయితే సుదూర ప్రాంతాలకు షెడ్యూల్ చేసుకున్న ప్రయాణాల విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలని, షెడ్యూల్ కూడా మరోసారి పరిశీలన చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎయిర్‌లైన్స్ నుంచి వచ్చే అప్డేట్లను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలని, అవసరమైతే రీషెడ్యూల్, రీఫండ్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. యుద్ధ పరిస్థితులు ఎలా మారుతున్నాయో అనుసరించి విమాన సేవలను గమనించాలని చెబుతున్నారు.

Fligh3
44కు పైగా విమానాలు రద్దు
రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ (శంషాబాద్) ఎయిర్పోర్ట్ నుంచి గడిచిన వారం రోజుల్లో 44-50కి పైగా విమాన సేవలు రద్దు చేసినట్లుగా అధికారులు తెలిపారు. యూఏఈ, ఖతార్, కువైట్, మార్గాల్లో విమానాలు పూర్తిగా నిలిచిపోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఎయిరిండియా, ఇండిగో, ఎమిరేట్స్, వంటి ప్రధాన ఎయిర్‌లైన్స్ కూడా గల్ఫ్ హబ్‌లలో ఏర్పడిన సమస్యల కారణంగా పలు సేవలను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఎయిర్‌లైన్స్ పరిశీలిస్తున్నాయి.
కానీ యూరప్ మార్గాలైన ఫ్రాంక్ ఫర్ట్, మునీచ్, లండన్ ద్వారా ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీంతోనే ఈ మార్గాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది. లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్వేస్ వంటి సంస్థలు ఈ మార్గాల్లో అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అలాగే సింగపూర్, టోక్యో, హాంకాంగ్ వంటి పసిఫిక్ మార్గాల ద్వారా కూడా కొంతమంది ప్రయాణికులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఆఫ్రికాలోని అడ్డిస్ అబాబా మార్గం కూడా ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతోంది. ఎయిర్‌ఫ్రాన్స్, క్యాతే పసిఫిక్ వంటి సంస్థలు మధ్యప్రాచ్య ప్రాంత దేశాలు లేకుండా ప్రయాణ మార్గాల్లో రాకపోకలు నిర్వహిస్తున్నారు.