హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 7 : ఓ వైపు ఎన్నికల విధులు.. మరోవైపు టెట్ గుబులు, ఇంకోవైపు పదో తరగతి పరీక్షలు, సిలబస్ కంప్లీట్ సర్కారు పంతుళ్లకు కత్తి మీదసాములా మారింది. రాను న్న రెండు మూడు నెలలు ప్రభుత్వ ఉపాధ్యాయులు అగ్ని పరీక్షను ఎదుర్కోనున్నా రు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ టీచర్లకు టెట్ భయం పట్టుకున్నది. టెట్ పాస్ కాకపోతే ఉద్యోగం కోల్పోవా ల్సి వస్తుందన్న బెంగతో ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే మరో వైపు టెట్ కోసం స్పెషల్ కోచింగ్ తీసుకుంటున్నారు.
ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు వారికి గుది బండలా మారాయి. ఈ నెల 11, 14, 17వ తేదీల్లో ఎన్నికల పోలింగ్, మరో 15 రోజుల వ్యవధిలోనే వచ్చే నెల 3న టెట్ పరీక్ష ఉంది. దీంతో టెట్‌కు సన్నద్ధమయ్యేందుకు సమయం లేకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి తోడు విద్యార్థులకు మిగిలిన సిలబస్‌ను పూర్తిచేయడంతోపాటు స్పెషల్ క్లాసులు తీసుకోవాలి. స్లిప్ టెస్టులు, వీక్లీ టెస్టులు పెట్టాలి. పేపర్లు దిద్దాలి. చదువులో వెనకబడిన విద్యార్థులపై శ్రద్ధ పెట్టాలి. మరోవైపు పదో తరగతి పరీక్షలు ముంచుకొస్తున్నాయి. ఇన్ని బాధ్యతల నడుమ టీచర్లు సెలవులు పెట్టలేని పరిస్థితి. మరోవైపు పంచాయతీ ఎన్నికల డ్యూటీతో పరేషాన్ అవుతున్నారు.
ఎన్నికలకు సంబంధించి ఒక్కో టీచర్ 10 నుంచి 15 రోజులు ఎన్నికల విధుల్లోనే గడపాల్సి వస్తుంది. ఎన్నికల విధుల్లో ఉన్నవారికి 2 రోజులు ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఇవికాకుండా ఎన్నిక సామగ్రిని స్వీకరణ, పోలింగ్, కౌంటింగ్, మిగిలిన సామగ్రిని సమర్పించేందుకు ఇలా మొత్తంగా మూడు నుంచి నాలుగు రోజులు దీనికే సరిపోతున్నది. ఎన్నికల తతంగం మొత్తం డిసెంబర్ 17తో ముగుస్తుంది. జనవరి 3 నుంచి 31 వరకు టెట్ పరీక్షలు జరుగనున్నాయి. ఎన్నికలు ముగిసిన 15 రోజుల తర్వాత టెట్ పరీక్షలు జరుగుతాయి. ఇంత తక్కువ సమయంలో టెట్‌కు సన్నద్ధం కావడం టీచర్లకు సవాల్‌గా మారింది. తెల్లవారుజామున 4 గంటలకే ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటూ టెట్ పాసయ్యేందుకు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇన్ని టెన్షన్ల నడుమ టెట్ పరీక్ష రాయలేమని, వాయిదా వేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.